మోంథా తుపాన్ ఓరుగల్లును పూర్తిగా ముంచెత్తింది. ట్రై సిటీస్.. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లు నీట మునిగాయి. భారీ వర్షాలు, వాగులు వంకు పొంగిపొర్లడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. కార్లు మునిగేంత నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాఘవాపూర్ వద్ద హైవేపై డివైడర్ కూల్చేసి నీటిని దిగువకు పంపిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రాకపోకలు నెమ్మదిగా జరుగుతున్నాయి.
మోంథా ధాటికి వరంగల్, హనుమకొండ జిలాలు ఆగమాగం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోయి.. రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్-హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుకాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

- హంటర్ రోడ్డులో బొంది వాగు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. మానుకోట, వరంగల్, హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి.
- హనుమకొండ-ములుగు రహదారి లోలెవ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి.
- ముగ్దుంపురం చెరువు అలుగు పోస్తుండడంతో.. నర్సంపేట-చెన్నారావుపేట రహదారిపై లోలెవల్ కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. దీంతో నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండకు రాకపోకలు నిలిచిపోయాయి.
- ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తుండగా.. 45 కాలనీలు నీట మునిగాయి. ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1200 మందిని తరలించినట్లు సమాచారం.
- వేల ఎకరాల్లో పంట నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- వరంగల్‌లో 9, హనుమకొండలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు
- వరద ప్రభావంతో భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ దాకా రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఆలయం వైపు మార్గాన్ని మూసేశారు.

ఉమ్మడి వరంగల్‌లో మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. హనుమకొండ భీమదేవరపల్లిలో 42.2 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 41.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33.8 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా సంగెంలో 33.8 సెం.మీ, నెక్కొండలో 35 సెం.మీ వర్షం,ఖిలా వరంగల్‌లో 34.3 సెం.మీ వర్షపాతం కురిసింది. వర్ధన్నపేట్ లో 32.8 వర్షపాతం నమోదుకగా, జనగామ జిల్లా పాలకుర్తిలో 29.4 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 25.8 సెం.మీ వర్షం కురిసింది.


