మోంథా తుపానుతో నష్టపోయిన రైతులకు దక్కని పంటల బీమా రక్షణ
ఖరీఫ్–2025 సీజన్‌లో రైతులు బీమా చేయించుకుంది 19.69 లక్షల ఎకరాలకే
ఇక ఈ సీజన్‌లో సాగైన వరి విస్తీర్ణం 38.97 లక్షల ఎకరాలు
రైతులు బీమా చేయించుకున్నది కేవలం 4.94 లక్షల ఎకరాలకు మాత్రమే
నోటిఫై చేసిన ఏ ఒక్క పంటకూ 10 శాతం కూడా దక్కని బీమా రక్షణ
నాడు ఐదేళ్లూ పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు
నేడు ప్రీమియం భారమంతా రైతు నెత్తిన మోపిన కర్కశ ప్రభుత్వం
ప్రభుత్వ నిర్వాకంతో బీమా పరిహారం దక్కే పరిస్థితి లేక తుపాను బాధిత రైతులు గగ్గోలు
ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం వచ్చేలా కృషి చేస్తానన్న చంద్రబాబు
మరి ప్రీమియం చెల్లించలేని నిరుపేదల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్న రైతులు
సీఎం వ్యాఖ్యలపై మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు
ఈయన పేరు శీలం శ్రీను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరి పంట సాగు చేశారు. ఇప్పటికే రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మోంథా తుపాను బారిన పడి పంట పూర్తిగా ముంపునకు గురై కుళ్లిపోతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.27 వేలు బీమా పరిహారంగా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారం భరించలేక చెల్లించలేదు. గత 17 నెలల్లో దాదాపు మూడుసార్లు వరి పంట నీట మునిగి పూర్తిగా పాడైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. ఈసారైనా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని శీలం శ్రీను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సాక్షి, అమరావతి: ‘పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే.. బీమా పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై తుపాను ప్రభావిత ప్రాంతాల రైతులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పైసా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించడం వల్లే తమకీగతి పట్టిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రీమియం చెల్లించిన వారికి బీమా పరిహారం ఇప్పిస్తానంటున్నావ్.. మరి ప్రీమియం భారం కావడంతో బీమా చేయించుకోలేని తమబోటి నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటి చంద్రబాబూ.. అంటూ నిలదీస్తున్నారు.
కూటమి సర్కారు నిర్వాకంతో బీమాకు దూరమైన లక్షలాది మంది తుపాను బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కులు చూస్తున్నారు. తుపాను బారినపడి దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఇందులో అత్యధికంగా వరి పంట 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతుల్లో నూటికి 90 శాతం మంది రైతులు ప్రీమియం భారం కావడంతో పంటల బీమా చేయించుకోలేకపోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రీమియం చెల్లించని రైతులకూ చంద్రబాబు ప్రభుత్వమే సొంతంగా బీమా పరిహారానికి సమానంగా ఆరి్థక లబ్ధి చేకూర్చి అండగా నిలవాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.  
ఖరీఫ్‌లో వరి సాగైంది 38.97 లక్షల ఎకరాలు.. బీమా చేయించుకుంది
4.94 లక్షల ఎకరాలకే.. ఉచిత పంటల బీమా పుణ్యమా అని గడిచిన 
ఖరీఫ్–2024 సీజన్‌లో 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించగా, 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. ఉచిత పంటల బీమా ఎత్తివేతతో రబీ–2024 సీజన్‌లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 19.55 లక్షల మంది రైతులు 19.69 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే 51.48 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 66.28 లక్షల మంది రైతులకు బీమా రక్షణ దక్కలేదు.
నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో 27 శాతం పంటలకు మించి బీమా కవరేజ్, 85 శాతం మంది రైతులకు బీమా రక్షణ లభించలేదు. దీంతో వారి పరిస్థితి ప్రçస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావం వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, అరటి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 38.97 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, రైతులు బీమా చేయించుకున్నది కేవలం 4.94 లక్షలు ఎకరాలకు మాత్రమే. అంటే దాదాపు 34 లక్షల ఎకరాల్లో సాగైన వరి పంటకు బీమా రక్షణ కరువైంది.
మొక్కజొన్న పంట 4.67 లక్షల ఎకరాల్లో సాగవగా. కేవలం 15,638 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఇక పత్తి విషయానికి వస్తే 11.4 లక్షల ఎకరాల్లో సాగవగా, కేవలం 1.03 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ లభించింది. అరటి 2.74 లక్షల ఎకరాల్లో సాగవగా, 16 వేల ఎకరాలకే బీమా కవరేజ్ పరిమితమైంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగవగా, కేవలం 2284 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఈ గణాంకాలు చాలు రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో స్వచ్ఛంద బీమా నమోదు అమలు తీరు ఏ విధంగా ఉందో చెప్పడానికి.

ఐదేళ్లూ పైసా భారం పడకుండా రైతుకు భరోసా
వైఎస్ జగన్ ప్రభుత్వం.. 2019–24 మధ్య ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పించింది. ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు.
ప్రభుత్వ వాటాతోపాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం అందిస్తే 2019–24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేయగా, వైపరీత్యాల వేళ పంటలు నష్టపోయిన 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందజేసి అండగా నిలిచారు.
17 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు 
ఖరీఫ్‌లో ఎకరన్నరలో వరి వేశా. రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి అందే వేళ మోంథా తుపాను ముంచేసింది. తీవ్రంగా నష్టపోయాను. పట్టుమని పది బస్తాలు కూడా చేతికొస్తుందో లేదో తెలియడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా పంటలు దెబ్బతిన్నప్పుడు పైసా చెల్లించకుండానే పంట బీమా పరిహారం ఇచ్చేవారు. నాకు కూడా పరిహారం వచి్చంది. కానీ ఇప్పుడు బీమా భారమైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడైనా పారదర్శకంగా నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం ఇప్పించాలి.    –బచ్చల తమ్మారావు, గుమ్మరేగుల, కాకినాడ జిల్లా
జగన్ హయాంలో ఎకరాకు రూ.36 వేల పరిహారం అందుకున్నాం.. 
వైఎస్ జగన్ హయాంలో ఇదే రీతిలో తుపాను వల్ల పంట నష్ట పోయిన సందర్భంలో ఎకరానికి రూ.36 వేలు పరిహారం అందుకున్నాను. ఉచిత పంటల బీమా పథకం ద్వారా పైసా భారం పడకుండా క్రమం తప్పకుండా పరిహారం జమ చేసేవారు. నాడు ప్రభుత్వం రైతులకు ఎంతో తోడ్పాటు అందించింది. ఇప్పుడు కూటమి సర్కారులో అటువంటిది కనిపించడం లేదు. ఇప్పుడు పంట కోల్పోయి బీమా ప్రీమియం చెల్లించని మా లాంటి రైతులం అన్యాయం అయిపోయేలా ఉన్నాము. కూటమి సర్కారు ఆదుకుంటుందో లేదోనని ఆందోళనగా ఉంది.    – పిల్లా శ్రీనివాస్, కొత్తపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా    

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
