అమరావతి: వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.
మొక్కుబడిగా చాలా తక్కువగా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా రద్దు, ఇన్‌పుట్ సబ్సిడీ రద్దు, పంటలకు లేని కనీస మద్దతు ధర, రైతులకు తగిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం, చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో.. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు తుపాన్‌లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు.
మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు, రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్  కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మరోవైపు ప్రతిచోటా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా రోప్‌పార్టీలు, బారికేడ్లు ఛేదించుకుని జనం, అభిమానులు తరలిరాగా, రైతులు తమ గోడు చెప్పుకున్నారు.

కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. పొలాల్లోకి:
కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, పంట పొలాల్లోకి దిగిన వైఎస్ జగన్ , రైతులతో మమేకం అయ్యారు. తుపాన్‌లో నష్టపోయిన పంటలను స్వయంగా చూశారు. రైతులతో మాట్లాడి వారి బాధలు ఆరా తీశారు. వారి ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. చివరగా పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, ఆకుమర్రులాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన, వారి బాధలు, కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..:

వరసగా నష్టాలు. అయినా అందని సాయం:
మోంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట నష్టం జరిగింది. కారణం ఏమిటంటే, ఇప్పుడు నష్టపోయిన పంటల్లో దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. అది పొట్టకొచ్చే దశలో ఉంది. అంటే గింజలు తయారయ్యే పరిస్థితి. ఈదురుగాలులు, భారీ వర్షాలతో చాలా నష్టం సంభవించింది. ఇంకా పత్తి, మొక్కజొన్న, బొప్పాయి మరో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, రైతులు నష్టపోయారు. ఈ 18 నెలల్లో 16 సార్లు అలా రైతులు ఇబ్బంది పడ్డారు. మరి ఏ ఒక్క  రైతుకు అయినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ డబ్బు అందిందా? పెట్టుబడి సాయం మొత్తం చేశారా? అంటే అదీ లేదు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడి, నష్టం జరిగినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.  అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేశాం. దీంతో ఏ రైతు ఇబ్బంది పడలేదు. అప్పుడు మూడు ఎకరాలున్న రైతులకు దాదాపు రూ.70 వేల పరిహారం అందింది.
అదే ఇప్పుడు చివరకు ఇప్పుడు యూరియా కూడా బ్లాక్‌లో కొనాల్సి వచ్చింది. బస్తా యూరియా దాదాపు రూ.600కు కొనాల్సి వచ్చింది. ఇంకా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1750 ఉంటే రైతుకు రూ.1300 కూడా రావడం రాలేదు. ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర రాలేదు.

నాడు జగనన్న ఉన్నాడన్న భరోసా:
అందుకే అందరూ మా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు. జగనన్న ఉన్నాడు. ఆదుకుంటాడు అన్న భరోసా ఉండేది. ఉచిత పంటల బీమా ఉంది. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సాయం చేస్తాడు. అలా ఏటా రూ.13,500 తప్పనిసరిగా ఇస్తాడు అన్న నమ్మకం రైతుల్లో ఉండేది. అలా వారిలో ఒక భరోసా ఉండేది. రైతులను చేయి పట్టి ఆర్బీకేలు నడిపించేవి. ప్రతి ఎకరా ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండేవారు. వారు పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేసే వారు. దాంతో ఏ పంటకు, ఏ ఇబ్బంది వచ్చినా, ఈ–క్రాప్ ఉంది కాబట్టి ప్రభుత్వం తోడుగా నిలబడేది.
ఆర్బీకేలు జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర వచ్చేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ జిల్లా జేసీకి సమాచారం ఇస్తే, వారు వెంటనే జోక్యం చేసుకుని, మార్కెట్‌లో పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడేవారు. సీఎం–యాప్ ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకేల్లో ఆసరగా నిల్చేవాళ్లం. దాదాపు రూ.7800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. అందుకోసం ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.
ప్రతి ఎకరా ఈ–క్రాప్ చేసి, ఉచిత పంటల బీమా ఇచ్చాం. 70 లక్షల ఎకరాలకు ఉచిత పంటల బీమా అమలు చేయడంతో, ఆ బీమా పరిధిలో ఏకంగా 85 లక్షల మంది రైతులు ఉండేవారు. ఉచిత పంటల బీమా వల్ల దాదాపు రూ.7800 కోట్ల పరిహారం రైతులకు అందింది. అదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి పంటల బీమా లేదు. మరి వారి పరిస్థితి ఏమిటి?. వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు?.

ఒక్క రోజులో ఎన్యుమరేషన్. ఎలా సాధ్యం?:
ఈరోజు ఈ రైతు ఒకే విషయం చెప్పాడు. ఎక్కడా, ఏ రైతు వద్దకు, ఏ పొలం వద్దకు ఎవరూ ఎన్యుమరేషన్ కోసం రాలేదు. ఇంకా ఇక్కడ ఒక దారుణ అంశం ఏమిటంటే..
(అంటూ ఆ ఆర్డర్ కాపీ చూపారు). ఇది అక్టోబరు 30న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్. ఎన్యుమరేషన్, సోషల్ ఆడిటింగ్ ఆ మర్నాటికల్లా (అంటే అక్టోబరు 31. కేవలం ఒకే ఒక్క రోజు) పూర్తి కావాలని అందులో ఆదేశించారు. అక్కడ ఇంకో పేరాలో ఏం రాశారంటే.. అక్టోబరు 31 నాటికి అవి కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పని చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఆ తర్వాత రైతులు కనీసం దరఖాస్తు కూడా చేయడానికి వీలు లేదు. ఆ వివరాలు నవంబరు 1నాటికి కలెక్టరేట్‌కు చేరాలట. 
ఇది ఎంత దారుణం. కేవలం ఒకే ఒక రోజులో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? అది సాధ్యమేనా? ఈదురుగాలులు, వర్షాలతో పంట నష్టం ఎలా జరిగింది? సుంకు విరిగిపోయిందా? పంట ఎలా ఉంది? సుంకు విరిగిపోతే, గింజ పాలు పోసుకోదు. ఎన్యుమరేషన్ చేసే వాళ్లు పొలంలోకి దిగి చూస్తేనే తెలుస్తుంది. కానీ, ఇక్కడ ఎక్కడా ఎవరూ రాలేదు. పొలంలోకి రాలేదు. అయినా ఎన్యుమరేషన్ జరిగిందని చెబుతున్నారు.

ఇంకో దారుణం.. ఒకటి తీసుకుంటే మరొకటి కట్:
ఈ పత్రాలు సమర్పించిన వారు, అక్టోబరు 31 నాడు పత్రాలు, డాక్యుమెంట్లు తెచ్చిన వారికే పరిహారం ఇస్తారట. అంటే ఇప్పుడు ఆ పని చేసిన రైతుల ధాన్యాన్ని, ఆ తర్వాత కొనుగోలు చేయబోమని చెప్పారు. అంటే ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం కోరిన రైతుల ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. కనీస మానవత్వం చూపాలి. పంట నష్టం జరిగితే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పరిహారం ఇవ్వాలి. పంటలు కూడా కొనుగోలు చేయాలి. కానీ, ఇక్కడ ఒకటి ఇస్తే, మరొకటి ఇవ్వబోమంటున్నారు. అంటే ఎంత నిర్దయగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ–క్రాప్‌కు పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ–క్రాప్ చేస్తే, ఇలాంటి విపత్కర పరిస్థితిలో శ్రీరామరక్షగా నిలుస్తుంది.

తూతూ మంత్రంగా ఈ–క్రాప్.. అందులోనూ అవినీతికి బీజం:
అసలు ఈ–క్రాప్ అంటే. రైతులను పొలాల్లో నిలిపి ఫోటో తీయాలి. కానీ, ఇప్పుడు ఈ–క్రాప్ పేరుకే చేస్తున్నారు. ఇంకా వాస్తవ పంటలకు మించి ఈ–క్రాప్ చూపుతున్నారు. టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా, ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు. అలా పర్చూరులో 112 శాతం, జె.పంగలూరులో 114 శాతం, బల్లికరువులో 115 శాతం, వేటపాలెంలో 117 శాతం, చీరాలలో 122 శాతం. చిన్న గంజాంలో 128 శాతం ఎక్కువ చూపుతున్నారు. అంటే ఉన్న భూమి కంటే ఎక్కువగా పంటను చూపుతున్నారు. ఆ స్థాయిలో ఈ–క్రాప్ నీరుగార్చారు.

కష్టాల్లో రైతులు. జల్సా టూర్లలో తండ్రీ కొడుకులు:
ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు ఉంటే, సీఎం ఏం చేశారు?. ఒకరోజు ఛాపర్‌లో అలా తిరిగి, మర్నాడు లండన్ వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చి, మర్నాడు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వెళ్లాడు. ఇది వాళ్ల వ్యవహారశైలి.

అదే మా ప్రభుత్వంలో నేనేం చేసేవాణ్ని?:
తుపాన్ రాగానే, అధికారులకు బాధ్యతలు అప్పగించేవాళ్లం. జిల్లాలు పెంచడం వల్ల, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఎక్కువగా వచ్చారు. ఇంకా సచివాలయాలు ఉండేవి. తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కలెక్టర్లకు నిధులు ఇచ్చే వాళ్లం. వారికి వారం, పది రోజుల టైమ్ ఇచ్చి, అన్నీ పక్కాగా చేయమనేవాళ్లం. ఆ తర్వాత నేను స్వయంగా వస్తానని చెప్పి, అలాగే పర్యటించేవాణ్ని. దాంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి, ఎలాంటి తప్పిదం లేకుండా చూసేవాళ్లు. నేను ఆ వారం, పది రోజుల తర్వాత ఎప్పుడు, ఎక్కడికి వస్తానో తెలియదు కాబట్టి, అందరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, అన్ని సహాయ కార్యక్రమాలు చేసేవారు. బాధితులను ఆదుకునే వారు.

నష్టాన్ని ఎందుకు తక్కువ చూపుతున్నారు?:
కానీ, ఈరోజు ప్రభుత్వం అనేది ఉందా? ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. పంట నష్టాన్ని ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు. పంటల నష్టం చాలా జరిగిందని ఎల్లో మీడియాలోనే రాశారు. మరి పంట నష్టం లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు? రైతులకు మంచి చేయకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? చంద్రబాబు, నీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదు. మీరు ప్రీమియమ్ కట్టి ఉంటే, వారికి పరిహారం ఉండేది. ఉచిత పంటల బీమా మీరు ఎత్తేయడం వల్ల, వారికి నష్టం జరుగుతోంది. కాబట్టి, అది ఇచ్చి మీరే ఆదుకోవాలి. రబీ నుంచైనా కచ్చితంగా ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్‌పుట్ సబ్సిడీ కింద కూడా తగ్గించి, తగ్గించి చివరకు రూ.600 కోట్లు బకాయి పెట్టారు. అది వెంటనే ఇవ్వాలి.
రైతుల పక్షాన పోరాడతాం:
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. వ్యవసాయం దండగ అనేది చంద్రబాబు వైఖరి. అందుకే వారికి ఈరోజు ఇన్ని ఇబ్బందులు. రైతులు రాష్ట్రానికి వెన్నెముక. వారిని ఆదుకోవాలి. లేకపోతే మేము రైతుల పక్షాన పోరాడతాం. ఇంకా కౌలు రైతులకు కార్డులు కూడా ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి. రాష్ట్రంలో రైతులకు న్యాయం, మేలు జరిగే వరకు వారికి తోడుగా నిలుస్తామని, పోరాడతామని వైఎస్ జగన్  ప్రకటించారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
