కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం | A grave injustice to farmers by giving a false name to free crop insurance | Sakshi
Sakshi News home page

కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం

Nov 3 2025 4:00 AM | Updated on Nov 3 2025 4:00 AM

A grave injustice to farmers by giving a false name to free crop insurance

తుపానుతో కకావికలమైనా కనికరం చూపని కూటమి ప్రభుత్వం

కష్టకాలంలో అన్నదాతలను గాలికి వదిలి సీఎం చంద్రబాబు లండన్‌ టూర్‌

క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షణ కోసం తనయుడు లోకేశ్‌ ముంబైకు..

కనీస బాధ్యత లేకుండా అన్నదాతలను నట్టేట ముంచిన ఏలికలు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంతో పాటు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు 

ఆఖరికి తడిచిన, రంగుమారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి న్యాయం చేసిన వైఎస్‌ జగన్‌

ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా చంద్రబాబు డ్రామాలు

ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం  

పెట్టుబడి సాయంగా ప్రతీ రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదువేలే విదిల్చిన వైనం

ఏ పల్లెకెళ్లినా ఒకటే దృశ్యాలు.. ఏ రైతును కదిలించినా ఒకటే వేదన. వరి మొదలుకొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మొలలోతు ముంపులో నానుతున్నాయి. వరికంకులు నేలనంటి కుళ్లిపోతున్నాయి. వరిచేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. పత్తి, మొక్కజొన్న, లంక గ్రామాల్లో సాగుచేసిన  అరటి, బొప్పాయి, పసుపు తోటలు నేలకూలి రైతుల ఆశలను చిదిమేశాయి. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన కూటమి సర్కారు వారిపై కనికరం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. కర్కశంగా వారిని గాలికొదిలేసింది. 

పంట నష్టనమోదు మొక్కుబడిగా చేస్తోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరును అటకెక్కించింది. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.ఐదువేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. 

తుపాను మిగిల్చిన తీరని నష్టంతో రైతులు తీవ్ర వేదనతో ఉంటే సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి లండన్‌ టూర్‌కు వెళ్లడం, ఆయన తనయుడు నారా లోకేశ్‌ సతీమణితో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌కంటూ ముంబై వెళ్లడంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కనీస కనికరం, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి దుష్టపాలనపై ధ్వజమెత్తుతోంది.

ఈయన పేరు వళ్లుం మురళీకృష్ణ. ఊరు ఏలూరు జిల్లా  ఉంగు­టూరు మండలం కాగుపూడి. ఈయనకు సొంతంగా రెండెకరాలుండగా, కౌలుకు మరో 8 ఎకరాలు తీసుకొని ఖరీఫ్‌లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుతో కలుపుకుంటే ఎకరాకు రూ.60వేలకుపైగా ఖర్చయింది. ఆరుగాలం కంటిపాపలా సాకిన పంట ఏపుగా పెరిగింది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మోంథా తుపాను అతని ఆశలను అంతమొందించింది. పంటను పూర్తిగా దెబ్బతీసింది. 

ఇప్పుడు రెల్లుపురుగు పంటను తినేస్తుంది. ఎకరాకు 25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీనిని కోయడానికి ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలి. వచ్చినదంతా కౌలుకే పోతోంది. పెట్టుబడి కూడా రాకపోగా ఇంకా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం మిగులుతుందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో రాదో అనే అయోమయం నెలకొందని, బీమా కూడా చేయించుకోలేదని, పది ఎకరాలకు కలిపి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. 

ఈయన పేరు యార్లపాటి సత్తిపండు.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈ రైతు ఆరెకరాల 75 సెంట్లు కౌలుకు తీసుకొని పీఎల్‌ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టారు.  ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల నుంచి నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. 

సర్కారు కౌలు కార్డు ఇవ్వలేదు.. పెట్టుబడి సాయం రాలేదు. తుపాను వల్ల కురిసిన వర్షంతో ధాన్యం గింజలు పొల్లు కింద రాలి పోతున్నాయి. ఊకైపోతున్నాయి. 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 16 బస్తాలు కౌలుకు ఇవ్వాలి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు.  దీంతో సత్తిపాండు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  

(పంపాన వరప్రసాదరావు) ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సాక్షి  ప్రతినిధి :  ఇప్పటికే ఏడాదిన్నరగా వరుస విపత్తులతో అల్లాడుతున్న రైతులపై ఇప్పుడు మోంథా తుపాను విరుచుకుపడి పంటలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 25 బస్తాలూ రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా పెట్టిన పెట్టుబడులూ రాకపోగా, ఇప్పుడు తడిచిన పంట కోతకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు అన్ని  పంటలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలసాయంపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. 

ప్రభుత్వ సాయమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా.. ఆ దాఖలాలు కానరావడం లేదు. సర్కారు వారిపై కనీస కనికరం చూపడం లేదు. బాధ్యత లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెడు­తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ ఏ జిల్లాకు వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కర్షకుల కన్నీటి గాధలు గుండెలను పిండేస్తున్నాయి. అన్నదాతల దీనస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 

కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ 
గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే రైతుల్లో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో నూటికి 70–80 శాతం మంది వారే. మోంథా తుపాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్లెదుటే పంట కుళ్లిపోతుంటే  వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుపాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. వరి కౌలు రైతులు ఎకరాకు 16–20 బస్తాలు భూ యజమానికి ఇచ్చు కోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి రూ.40వేలు కిస్తీ కట్టాల్సిందే. 

ఏడాదిన్నరగా కౌలు కార్డుల్లేక.. పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలకు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న వీరంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల వద్ద రూ.2, రూ.3 వడ్డీలకు అప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రతి కౌలు రైతుకూ రూ.3లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికే ఎకరాకు సగటున రూ.35 వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని కుమిలిపోతున్నారు.   

కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు.. 
వరిని యంత్రాలతో కోస్తే కానీ ఉన్న కొద్దిపాటి పంట చేతికొచ్చే పరిస్థితిలేదు. అయితే యంత్రాలతో ఎ­క­రా కోతకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3 వేల నుంచి రూ.4వేలు యంత్రాల నిర్వా­హకులు డిమాండ్‌ చేస్తున్నారని రైతులు చెబు­తున్నారు. దీనికి ఎంత చూసుకున్నా.. ఎకరాకు రూ.15­వేలు అదనంగా ఖర్చయ్యేలా ఉందని ఆవేదన చెందు­తున్నారు. 

ఇంతా కష్టపడి తీరా కోసి ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దాంట్లో 17 బస్తాలు కౌలుగా భూ యజమానికే ఇవ్వాలి. ఇక మాకు మిగిలేది ఏమిటంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటంతా తడిసి ముద్దవడంతో అధిక తేమశాతంతోపాటు రంగుమారే అవకా­శాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి గింజలకు మొలకలొచ్చేశాయి. 

మరొక వైపు రెల్ల పురుగు నేలనంటిన దుబ్బులును కొరికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట దేవుడెరుగు కొనేవారుండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా.. కనీసం భూ యజమానికి కీస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు.

అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
తుపాను వేళ ప్రభుత్వం ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై రైతు­లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ముందెన్నడూ ఇలాంటి దుస్థి­తి చూడలేదని, కనీసం పంట నష్టం అంచనాల కోసం తమ పొలాల వైపునకు అధికారు­లు రావడం లేదని, రైతు సేవా కేంద్రాలకు వెళ్తే రాస్తాంలే అంటూ సమాధానాలు చెబుతున్నారని దువ్వకు చెందిన అప్పారావు అనే కౌలు రైతు సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 

తుపాను దెబ్బకు తాము పెట్టు­బడిని సైతం కోల్పోతున్నామని వరి రైతు­లు, తాము లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతున్నామని అరటి తదితర వాణిజ్య పంటల రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోక పోతే తమకు అ«ధోగతే అని, వ్యవసాయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో నాడు అడుగడుగునా అండగా..
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. 2023 డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపా­ను సమయంలో ఇదేరీతిలో పంటలు ముంపునకు గురైన వేళ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) సిబ్బంది రైతులతో కలిసి పంట చేలల్లోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడంతోపాటు నష్ట పరిహార నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టారు. ముంపునకు గురైన పంటలను ఎలా రక్షించుకోవాలో సూచనలు, స­ల­హాలు అందించారు. అప్పటి వైఎస్‌ జగన్‌ సర్కారు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ వేగంగా చెల్లించడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొను­గోలు చేసింది. 

ఆఖరికి తడిచిన, రంగు మారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పొలాలవైపు కన్నెత్తి చూడడం లేదు. కిందిస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పంటనష్ట అంచనాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీకి మంగళం పాడేందుకు సర్కారు కుటిలయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోలుకూ డ్రామాలు ఆడుతోంది.

ఇంకా నీటి ముంపులోనే లక్షలాది ఎకరాలు  
తుపాను తీరం దాటి నాలుగు రోజులు గడిచినా లక్షలాది ఎకరాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు, అనిగండ్ల పాడు, మాగొల్లు, విజయవాడ రూరల్, ఎన్టీఆర్‌ జిల్లా  ఏటూరు, తోటరావుల పాడు, చింతలపాడు, ఏలూరు జిల్లా ఉంగుటూరు,  పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, జగన్నాధపురం, మిలట్రీ మాధవరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పెనికేరు,, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, అంబాజీపేట మండలం గంగలకుర్రు, కాకినాడ జిల్లా కరప, వేళంగి తదితర గ్రామాల్లో పంట చేలు నేటికీ ముంపునీటిలోనే ఉన్నాయి. రావులపాలెం మండలం ఈతకోట, పి. గన్నవరం, మామిడి కుదురు మండలాల్లో పలు గ్రామాల్లో నేలకొరిగిన అరటితోటలు సైతం ముంపునీటిలో ఉన్నాయి.  

రైతాంగ కష్టాలు వదిలి షికార్లు దుర్మార్గం  
మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయు­డు ఇతర ప్రాంతాలకు షికార్లకు వెళ్లడం దుర్మార్గం.    – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం  

ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? 
మోంథా తుపాను దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి కూటమి నేతలు రాష్ట్రా­న్ని వదిలి షికార్లు  చేస్తుండడం ఎంతవరకు సమంజసం. ఇదేనా పాలకుల చిత్తశుద్ధి?   – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏపీ కౌలురైతుల సంఘం 

రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలకుల టూర్లు  
తుపాను బారిన పడి తీవ్రంగా నష్టపోయి రైతులు పుట్టెడు కష్టా­ల్లో ఉంటే వారి­ని ఆదుకోవాల్సింది పోయి సీఎం టూర్లు చేయడం ఏమిటి? తుపాను నష్టాన్ని తక్కువగా చూపేందుకు సర్కారు యత్నిస్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లా సి. కె. దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాలలో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి. మఠం మండలాలలో జరిగిన పంట నష్టం గురించి అధికారులు చూసిన పాపాన పోలేదు. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. – జీఎస్‌ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఏపీ రైతు సంఘం 

ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి  
రైతులను కూటమి ప్రభుత్వ పెద్దలు గాలికొదిలారు. రాష్ట్రంలో ఈ–పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పంటనష్ట నమోదు మొక్కుబడిగా సాగుతోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ అందని ద్రాక్షగా ఉంది. దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధరకు సర్కారే కొనాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.    – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ, కౌలురైతుల సంఘం 

25 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదు  
మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగానే సాగు చేస్తున్నాం., మరో 15 రోజుల్లో కోతకోసే వాళ్లం. ఇంతలోనే మోంథా తుపాను ముంచేసింది. వంద బస్తాలు అవ్వాల్సింది. ఎకరాకు 25 బస్తాలకు మించి పంట దిగుబడి వచ్చేటట్టు లేదు.     – గండికోట నాగయ్య, కాగుపాడు, ఏలూరు జిల్లా 

పెట్టుబడి కూడా రాని దుస్థితి  
పెట్టుబడి వస్తాదో రాదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎకరంన్నరలో స్వర్ణ సాగు చేశా. మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదు­రు చూశాం. మోంథా తుపాను మా ఆశలను నాశనం  చేసింది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. కనీసం పెట్టుబడి కూడా మిగలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.  – దొడ్డి మోహనరావు, కౌలురైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement