శ్రీశైలంలో నీటి ఉద్ధృతికి కోతకు గురైన మత్స్యకారుల నివాసాలు
నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
పలు గ్రామాల్లో మూగబోయిన సెల్ ఫోన్లు
శ్రీశైలం రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు
నీట మునిగిన లోతట్టు కాలనీలు
సాక్షి నెట్‌వర్క్: మోంథా తుపాను పంట పొలాలను ముంచెత్తడమే కాకుండా ఇతరత్రా అపార నష్టం కలిగించింది. పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వేలాది వృక్షాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాలు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా చిగురుటాకులా వణికి పోయింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు, వర్షాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. 119 సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు మూగబోయాయి.
నాగాయలంక మండలం ఎదురుమొండి మండలం దీవిలో జింకల పాలెం రోడ్డు పూర్తిగా కృష్ణా నదిలో కలిసిపోయింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఇద్దరు చంటి పిల్లలతో తలదాచుకున్న మహిళ బుధవారం వేకువజామున వాష్ రూంకు వెళ్లగా పాముకాటుకు గురైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని విద్యాధరపురంలో రేకుల షెడ్‌పై కొండ చరియలు జారి పడటంతో ఇల్లు, అందులోని సామాన్లు ధ్వంసమయ్యాయి. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తిరువూరు నియోజకవర్గంలో కట్టెలేరు, పడమటి వాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగు, తిప్పలవాగు, అనురాధవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లవాగు పొంగడంతో నందిగామ–చందర్ల పాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా వినుకొండ రూరల్ మండలంలోని అంధుగల కొత్తపాలెం, మదమంచిపాడు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది.
దీంతో గుంటూరు–ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. నక్కవాగు పొంగింది. నూజెండ్ల మండలం కొండల్రాయునిపాలెంలో 11 గొర్రెలు నీట కొట్టుకుపోయాయి. వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన చెంచు గిరిజనుడు గురవయ్యకు చెందిన 10 మేకలు వాగులో గల్లంతయ్యాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

నీట మునిగిన వెలుగొండ సొరంగాలు
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. రెండు సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. శ్రీశైలం రహదారిలోని గోర్లెస్ కాలువ, కర్నూలు రహదారిలోని దొంగలవాగు, మార్కాపురం రహదారిలోని తీగలేరు వాగులు పొంగి ప్రవహించాయి. శ్రీశైలం ఘాట్‌లోని తుమ్మలబైలు వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా బుధవారం సాయంత్రం వరకు శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు, యాత్రికులు రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. పలు వాహనాలను దారి మళ్లించారు. తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యర్రగొండపాలెం–మాచర్ల హైవే రోడ్డు కోతకు గురికావండతో మంగళవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో 6 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అట్లేరు వాగు పొంగడంతో కొండపి–అనకర్లపూడి మధ్య, కోయవాగు పొంగడంతో చిన్నకండ్లగుంట–తాటాకులపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలో 27 ఇళ్లు, ఒక చర్చి నేలమట్టమయ్యాయి. ఒంగోలు శివారు ప్రాంత కాలనీలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
డుంబ్రిగుడ మండలంలోని వంతరాడలో ప్రాథమిక పాఠశాల కుప్పకూలింది. సెలవు కావడంతో చిన్నారులకు పెద్ద ప్రమాదమే తప్పింది. నంద్యాలలో చామకాల్వ, మద్దిలేరువాగు, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల సమీపంలో కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
తాడికొండ: మోంథా తుపాను ప్రభావంతో రాజధాని ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద వంతెనపై కొండవీటి వాగుకు వరద పోటెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. పెదపరిమి–తుళ్లూరు మధ్య కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం సాయంత్రం వరకు రాకపోకలు మొదలవ్వలేదు. పాములపాడు–మండెపూడి గ్రామాల మధ్య కొండవీటి వాగు, తాడికొండ–కంతేరు మధ్య ఎర్రవాగు పొంగడంతో లెవల్ చప్టాపై నీరు చేరి వాహనాలు నిలిచిపోయాయి.
పెదపరిమి–నెక్కల్లు గ్రామాల మధ్య వరద నీరు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు వరద నీరు భారీగా నిలిచి పోవడంతో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ చుట్టూ నీరు చేరింది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగి సముద్రాన్ని తలపిస్తోంది. కాగా, అమరావతికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పెదపరిమి–తుళ్లూరు మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో బుధవారం ఒక్క రోజే 5 ఇసుక లారీలు రోడ్డుపై కూరుకుపోయాయి.


