నవంబర్ 18న కర్నూలులో ఏపీఈఆర్‌సీ సమావేశం
విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ
చార్జీలు పెంచేది లేదు.. తగ్గిస్తామని మాట తప్పిన చంద్రబాబు
అధికారంలోకి రాగానే ప్రజలపై వరుసగా చార్జీల వడ్డన
సాక్షి, అమరావతి: ‘మాకు ఓట్లేయండి... అధికారం ఇవ్వండి, పాలన చేతికొస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం...’ అంటూ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు కూటమి పార్టీల నేతలు. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల నడ్డి విరిచేలా చార్జీల భారం మోపుతున్నారు. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో బాదుతోంది.
తాజాగా రూ.12,771 కోట్ల వడ్డనకు తయారైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు,సీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్లు చొప్పున లోటులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి.
ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్... ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలులోని కోర్టు హాలులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఆది నుంచే...
కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారం వేసి విద్యుత్ చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టింది. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి... అంటే 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది.
ఇందులో ఇటీవల రూ.1,863.64 కోట్లకు అనుమతి లభించింది. వసూలు చేసిన దానిలో రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీఈఆర్‌సీ చెప్పింది. ఈ లెక్కన ప్రజలపై ఇప్పటివరకు రూ.17,349 కోట్ల మేరకు చార్జీల భారం వేసినట్లైంది. ఇది చాలదన్నట్లు మరో పిడుగు పడనుంది. డిస్కంలు అడుగుతున్న రూ.12,771.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ ప్రజల పైనే వేయాల్సి ఉంటుంది.


