హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు ప్రమాణం | Justice Subhendu sworn in as High Court judge | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు ప్రమాణం

Oct 30 2025 5:20 AM | Updated on Oct 30 2025 5:20 AM

Justice Subhendu sworn in as High Court judge

జస్టిస్‌ సుభేందుతో ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు సమంతో ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ సుభేందుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్‌ సుభేందు బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారథి చదివి వినిపించారు. 

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ సుభేందు కుటుం­బ­సభ్యులు.. అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్‌.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పసల పొన్నారావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు జస్టిస్‌ సుభేందును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన.. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కలిసి కేసులను విచారించారు.  

దుర్గమ్మ సేవలో..   
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభేందు సమంతో దర్శించుకున్నారు. నూతన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణకు ముందు జస్టిస్‌ సుభేందు సమంతో దంపతులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. 
–ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) 

Advertisement
 
Advertisement
Advertisement