మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాçపురంలో ఈదురుగాలులకు నేలవాలిన వరిపంట
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
105 ప్రాంతాల్లో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం
అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.04 సెం.మీ.
పొంగిపొర్లుతున్న వాగులు.. మళ్లీ మత్తళ్లు దుంకుతున్న చెరువులు
చేతికొచ్చిన పంటలు నీటిపాలు.. అన్నదాతల గగ్గోలు
నాగర్‌కర్నూల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలు అతలాకుతలం
రోడ్లపై వాహనాలు బంద్.. నిలిచిపోయిన పలు రైళ్ల రాకపోకలు
సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి
నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామకు రెడ్ అలర్ట్
సాక్షి, నెట్‌వర్క్: మోంథా తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోగా... కాల్వలు, వాగులు ఉప్పొంగాయి. వరదనీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరిగాయి. కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్‌కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి.
29 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంథా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంథా బలహీనపడి వాయుగుండంగా మారింది. గురువారం మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు...
⇒ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
⇒ ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
ఓరుగల్లు అతలాకుతలం
ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంథా తుపాను కుదిపేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకొచ్చిన వరి పంట నేలరాలింది. ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసింది. మిర్చి, మొక్కజొన, పత్తి రైతుల పరిస్థితి ఆగమాగమైంది. 30 శాతమే వరికోతలు పూర్తి కాగా, సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి.
పత్తి ఏరడానికి సిద్ధమైన తరుణంలోనే తుపాను రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని సుమారు 71 కాలనీల్లో వరద నీరు చేరినట్లు సమాచారం. గురువారం కూడా తుపాను కొనసాగుతుందన్న వాతావరణశాఖ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా> ఆరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. 
జలదిగ్బంధంలో ‘గ్రేటర్ వరంగల్’...
భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. హనుమకొండ బస్టాండ్‌లోకి భారీగా వరద చేరి చెరువును తలపించింది. ఎస్‌ఆర్ నగర్, వివేకానందనగర్, సాయిగణేశ్‌కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గిరిప్రసాద్‌నగర్, గాం«దీనగర్, మైసయ్యనగర్, భద్రకాళినగర్, పోతననగర్, రాజీవ్‌నగర్, సమ్మయ్యనగర్, వాజ్‌పేయి కాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇంద్రానగర్, దీన్‌దయాళ్‌నగర్, కాజీపేట ప్రశాంత్‌నగర్, బ్యాంక్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ, నయీంనగర్, కేయూ క్రాస్‌రోడ్డు, ములుగు క్రాస్‌రోడ్డు, హంటర్‌రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, అంబేడ్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావటంతో గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఏజేన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలపైకి వరద చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. వరంగల్‌లో ఇంటర్‌సిటీ, ఈస్ట్‌కోస్ట్, మహబూబాబాద్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు షాలిమార్, టాటా నగర్, షిరిడీ, కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట మీదుగా దారి మళ్లించి భాగ్యనగర్, శాతవాహనను కూడా రద్దు చేశారు. 
అంతటా అప్రమత్తం...
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 7981975495, టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1115 ఏర్పాటు చేశాం. అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లరాదని, సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని ఆదేశాలు జారీచేశాం.
– స్నేహ శబరీష్, హనుమకొండ జిల్లా కలెక్టర్
రంగారెడ్డిలో పొంగుతున్న వాగులు
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. తలకొండపల్లిలో అత్యధికంగా 11.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలు నీట మునిగాయి. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిపోయింది. పత్తి, వరి, కూరగాయలు, పూల తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మూసీ, ఈసీ, కాగ్నా సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కాగ్నా వాగులో కొట్టుకుపోతున్న యాలాల మండలం అగ్గనూరుకు చెందిన పెద్దింటి నర్సింలు అనే వ్యక్తిని కాపాడారు. అతడు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 21.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంల పైకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 
ఖమ్మం జిల్లాను వణికించిన మోంథా
మోంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంటలు నాశనమయ్యాయి. బోనకల్ మండలంలో 9.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు బ్రిడ్జి పైనుంచి వెళ్లటానికి ప్రయతి్నంచిన డీసీఎం వరద నీటిలో కొట్టుకుపోయింది. డీసీఎంను నడిపిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోతీనగర్ కాలనీకి చెందిన ఆరేపల్లి మురళి (32) నీటిలో గల్లంతయ్యాడు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో రైల్వేట్రాక్‌పైకి వరద చేరడంతో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దుచేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఖమ్మంలోని మున్నేటి వరద ఉధృతిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో కొట్టుకుపోతున్న డీసీఎం వాహనం
నాగర్‌కర్నూల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 18.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, తెలకపల్లి, బల్మూర్ మండలాల్లో 12 సెం.మీ. వర్షం కురిసింది. నల్లమలలోని ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట వాగులో కారు కొట్టుకుపోయింది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్‌పేటలో ఓ ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న చింతామణి అనే మహిళలను పోలీసులు కాపాడారు. మహబూబ్‌నగర్‌లో ఎర్రకుంట, కొత్తచెరువు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది.
హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిపివేత
నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి అలుగు ఉధృతంగా పారుతోంది. ప్రాజెక్టుకు కుడి భాగాన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న రెండో అలుగు దిగువన హైదరాబాద్ – శ్రీశైలం రహదారి బ్రిడ్జి వరద ధాటికి దెబ్బతింది. దీంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్–శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను తెలకపల్లి– లింగాల– బల్మూర్– అచ్చంపేట మీదుగా దారి మళ్లించారు. 
చెట్టు కూలి వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) చెట్టు కూలిపడి మరణించాడు. నూతనకల్ మండల పరిధిలోని తానంచర్ల గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తున్న అతడు.. సొంత గ్రామంలోని పామాయిల్ తోటను చూసేందుకు బుధవారం వెళ్తుండగా చందుపట్ల గ్రామ శివాలో భారీ వృక్షం మొంథా తుపాన్ ధాటికి కూలి ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు.
కామారెడ్డి, నిజామాబాద్‌లో అప్రమత్తం
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు కల్లాల్లోని ధాన్యం కుప్పలు తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా కుప్పలు చేసి బుధవారం రోజంతా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిలిపేశారు. వ్యవసాయ అధికారుల సూచనతో రైతులు పంట కోతలను కూడా ఆపేశారు.
ఉమ్మడి కరీంనగర్‌లో పంటలకు తీవ్ర నష్టం
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ పట్ణణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామగుండం రీజన్‌లోని సింగరేణి ఓసీపీలో 1.5 లక్షల ఓబీ తవ్వకాలు, 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నక్కవాగు, బిక్కవాగు, గంజివాగు, మానేరు, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీరును దిగువకు వదులుతున్నారు.
నల్లగొండ జిల్లా అతలాకుతలం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి వద్ద గిరిజన బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వరదనీరు చుట్టముట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం– వెంకేపల్లి – కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం, ధర్మాపురం గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్ల విరిగిపడి స్తంభాలు నేలకూలాయి. కోదాడ పట్టణంలో ఉలకవాగు అలుగుపోయడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామాపురం ఊర చెరువుకు గండి పడి వరిపొలాలు నీట మునిగాయి. వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల మండలం మాసాన్‌పల్లి, నారాయణపురంలో పలువురి ఇళ్లు కూలాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
విశాఖ పట్నం నుంచి తిరిగొచ్చిన విమానం
హైదారాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం బయలుదేరి వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రె 2885 విమానం బుధవారం ఉదయం 6.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తుపాను కారణంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విమానం దిగేందుకు ప్రతికూల వాతావరణం ఉడడంతో దానిని తిరిగి హైదారాబాద్‌కు మళ్లించడంతో 9.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో 6ఈ 7201 విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.


