నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం | Rains expected in the state for the next four days | Sakshi
Sakshi News home page

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

Jun 26 2025 5:32 AM | Updated on Jun 26 2025 7:17 AM

Rains expected in the state for the next four days

రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులూ వర్షాలు 

కోస్తాలో మోస్తరుగా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం

సాక్షి, అమరావతి/మహారాణి పేట (విశాఖ): బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 

తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్‌ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement