సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బీజేపీ–జేడీఎస్ కూటమిలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో, కర్ణాటక రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కాగా, 2023 సెప్టెంబర్‌లో అధికారికంగా ఎన్డీయేలో చేరిన జేడీఎస్, బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవి కూడా లభించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానాల మేఘాల్లో చిక్కుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరగలేదని, కూటమి ఎమ్మెల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో బీజేపీ–జేడీఎస్ మధ్య ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఐక్యత కనిపిస్తున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొట్టిపారేశారు. బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు ఎవరు చేస్తారు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన క్రాస్ ఓటింగ్ వివాదం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


