World Music Day: హిట్‌ అయిన ఫార్ములానే సంగీతమా? | World Music Day 2026 Six Women Artists Call for Risk and Authenticity in Indian Music | Sakshi
Sakshi News home page

World Music Day: హిట్‌ అయిన ఫార్ములానే సంగీతమా?

Jun 21 2026 9:05 AM | Updated on Jun 21 2026 11:16 AM

World Music Day 2026 Six Women Artists Call for Risk and Authenticity in Indian Music

ముంబై: సంగీతం అంటే కేవలం ట్రెండ్స్, చార్ట్‌బస్టర్ నంబర్లు, కోట్ల వ్యూస్ మాత్రమేనా? అంటే కాదనే సమాధానం ఇస్తున్నారు భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఆరుగురు ప్రముఖ మహిళా సింగర్స్. నేడు(జూన్‌ 21) అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా షల్మాలి ఖోల్గడే, జస్లీన్ రాయల్, లీసా మిశ్రా, కయాన్, డీజే నినా షా, ప్రతీక్షా శ్రీవాస్తవ వంటి స్టార్ ఆర్టిస్ట్‌లు నేటి మ్యూజిక్ ఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ ఫార్ములాలు, ఆల్గారిథమ్స్‌ల వెనక పడకుండా, సంగీతంలో ‘రిస్క్’ తీసుకునే ధైర్యాన్ని ఇండస్ట్రీ అలవర్చుకోవాలని వారు  పిలుపునిచ్చారు.

ఫార్ములాలు వద్దు.. భావోద్వేగాలే ముఖ్యం
నేటి ఇండస్ట్రీ కేవలం గతంలో హిట్ అయిన ఫార్ములాలనే నమ్ముకుంటూ, కొత్తదనాన్ని చంపేస్తోందని ఈ సింగర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక సీజన్ మాత్రమే వినే పాటల కంటే, శ్రోతల గుండెల్లో నిలిచిపోయే సంగీతమే నిజమైనదని షల్మాలి ఖోల్గడే స్పష్టం చేశారు. పాట అనేది మనుషులను భావోద్వేగంగా కదిలించాలని జస్లీన్ రాయల్ అభిప్రాయపడగా, ఇండస్ట్రీ కేవలం కొన్ని క్లిప్‌ల కోసం మాత్రమే పాటలను డిజైన్ చేస్తోందని, కానీ శ్రోతలు మాత్రం ఒక మంచి ఆర్టిస్ట్‌ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారని ప్రతీక్షా శ్రీవాస్తవ పేర్కొన్నారు.

నాయకత్వ స్థానాల్లో మహిళలు పెరగాలి
మ్యూజిక్ రంగంలో అద్భుతమైన మహిళా టాలెంట్ ఉన్నప్పటికీ, వారికి సరైన అవకాశాలు, గుర్తింపు దక్కడం లేదని జస్లీన్ రాయల్ అన్నారు. పరిశ్రమలో కీలక నిర్ణయాలు తీసుకునే లీడర్‌షిప్ స్థానాల్లో మరికొంత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందని ఆమె ఆకాంక్షించారు. అలాగే నేటి డిజిటల్ యుగంలో సింగర్స్ కేవలం పాటలు పాడటమే కాకుండా కంటెంట్ క్రియేటర్లుగా, మార్కెటర్లుగా మారాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై తీవ్రమైన మానసిక, సృజనాత్మక ఒత్తిడి పెరుగుతోందని డీజే నినా షా ఇండస్ట్రీలోని మరో కోణాన్ని బయటపెట్టారు.

సాంకేతికత - రిస్క్ తీసుకునే ధైర్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతను లీసా మిశ్రా ఒక మంచి సాధనంగా అభిప్రాయపడ్డారు. సాంకేతికతను కేవలం సహాయకారిగా వాడుకోవాలే తప్ప, అది క్రియేటర్‌గా మారకూడదన్నారు. రిస్క్ తీసుకోకపోతే బోర్ కొట్టించే సంగీతమే మిగులుతుందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రపంచం నుండి కాస్త దూరంగా జరిగి, మనసుకు నచ్చిన సొంత శైలిలోనే, ట్రెండ్స్‌ను ఫాలో అవ్వకుండా నిజాయితీగా రిస్క్ తీసుకుంటూ పాటలు చేయడమే నేటి తరం కళాకారులకు అత్యంత అవసరమని ఈ ఆరుగురు మహిళా మణులు తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement