నేడు(జూన్ 21) ఫాదర్స్ డే.. మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు మన తండ్రులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారిని గౌరవించుకునే శుభ సందర్భం ఇది. మనలో చాలా మందికి మన తండ్రులే రోల్ మోడల్స్. వారి అడుగుజాడల్లో నడవాలని, వారి కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు కోరుకుంటారు. దీనికి బలమైన ఉదాహరణలు రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. రాజకీయ ప్రయాణంలో కలిసి నడిచిన, నడుస్తున్న కొందరు తండ్రీ-కొడుకులు, తండ్రీ-కూతుళ్ల గురించి ఈ కథనం చెబుతుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన తనయులు
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జీవితం నిరంతరం వివాదాలతో ముడిపడి ఉన్నప్పటికీ, బిహార్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరుగాంచారు. ఆయన రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, ఐదేళ్లపాటు కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం (ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు) కాగా, వీరిలో ఇద్దరు కుమారులు ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. వీరిలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో బిహార్ ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. మరొక కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరూ తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
బాల్ థాకరే.. ఉద్ధవ్ థాకరే
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరొందారు. తన సొంత పార్టీని ప్రారంభించడానికి ముందు ఆయన కార్టూనిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మరాఠీ మాట్లాడే ప్రజల బలమైన పక్షపాతిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా, తన శ్రేణులపై అపారమైన పట్టును కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే, తన తండ్రి మరణానంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన నాయకత్వంలో శివసేన ఒక ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఉద్ధవ్ ఎల్లప్పుడూ తన పంథాను కాపాడుకుంటూ పార్టీ జెండాను స్థిరంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.
శరద్ పవార్ - సుప్రియా సూలే
ఇండియన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)వ్యవస్థాపకుడు శరద్ పవార్, మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మాస్టర్ ట్రబుల్‌షూటర్’ గా పేరొందారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఆయనకు ఎంతో గౌరవం అందుకుంటున్నారు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో పలు కీలక మంత్రిత్వ శాఖల పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. ఈ మరాఠా దిగ్గజం శివసేన- కాంగ్రెస్ నాయకులను ఒకతాటిపైకి తెచ్చి, బీజేపీయేతర ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే 2006లో రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. భ్రూణ హత్యలు, ఇతర సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పలు చైతన్య ప్రచారాలకు ఆమె నాయకత్వం వహించారు.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆయన స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రి మాత్రమే కాకుండా, దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తన తండ్రిలాగే ఆయన కుమార్తె ఇందిరా గాంధీ కూడా ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు పొందిన రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. తన తండ్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిర ఆయనకు కీలక సహాయకురాలిగా ఉన్నారు. ఆయనతో పాటు అనేక విదేశీ పర్యటనలకు వెళ్లారు. 2020లో గత శతాబ్దాన్ని శాసించిన ప్రపంచంలోని ‘100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో ఇందిరా గాంధీని ప్రతిష్టాత్మక ‘టైమ్’ పత్రిక చేర్చడం విశేషం.
రాజీవ్ గాంధీ – ప్రియాంక, రాహుల్ గాంధీ
ఇందిరా గాంధీ పెద్ద కుమారుడైన రాజీవ్ గాంధీ, తన తల్లి హత్య తర్వాత భారతదేశ ఆరవ ప్రధానమంత్రి అయ్యారు. కేవలం 40 సంవత్సరాల వయస్సులోనే దేశ ప్రధాని పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన చరిత్రకెక్కారు. దురదృష్టవశాత్తూ ఆయన కూడా 1991లో హత్యకు గురయ్యారు. ఆయన సంతానమైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యే వరకు చాలా కాలం పాటు తన తల్లికి నమ్మకమైన ఎన్నికల ప్రచార మేనేజర్‌గా వ్యవహరించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వీరిద్దరూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.


