‘సాక్షి’ ఎఫెక్ట్...
విస్తృతంగా తనిఖీలునిర్వహిస్తున్నట్టు రవాణాశాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏసీ స్లీపర్ బస్సుల్లో గాజు చాంబర్లు ఏర్పాటు చేస్తున్న బస్సులపై రవాణాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇంతకాలం సాధారణ కర్టెన్లతోనే సరిపెట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు, బెర్తులకు కొత్తగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘‘గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ’’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.
నగరంలోని మియాపూర్‌లో రంగారెడ్డి జిల్లా డీటీఓ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్రియా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సును సీజ్ చేశారు. అందులో గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన బస్సులను సీజ్ చేసి వాటిని తొలగింపజేసి, బస్సు ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు రవాణాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన సాధారణ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 928 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపింది.
అంతకుముందు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ నగరంలోని పలు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో భేటీ అయి, నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులు సీజ్ చేసి భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సాక్షి వెలుగులోకి తెచ్చిన గాజు చాంబర్ల అంశాన్ని ప్రస్తావించి... వాటి ఏర్పాటు అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలాగాటమాడినట్టేనని, ఆ కొత్త విధానాన్ని విస్తరించకుండా చూడాలన్నారు.


