నోటికాడి బువ్వ.. నీటిపాలు | Rain fell in all districts across Telangana | Sakshi
Sakshi News home page

నోటికాడి బువ్వ.. నీటిపాలు

May 22 2025 6:01 AM | Updated on May 22 2025 6:01 AM

Rain fell in all districts across Telangana

ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలోని కొనుగోలు కేంద్రంలో వర్షపు నీటిలో ధాన్యం నిల్వలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షం  

సాక్షి, హైదరాబాద్‌/ నల్లగొండ/ మంచిర్యాల అగ్రికల్చర్‌/ మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/ నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి చాలా వరకు తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిచిపోవటంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది.  

ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 10 ఎల్‌ఎంటీ 
రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారికంగా చెబుతోంది. అందులో 56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగా, మిల్లులకు తరలించింది 54.33 ఎల్‌ఎంటీ మాత్రమే. అంటే ఇంకా సుమారు 6 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ములుగు, మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అక్కడక్కడ కోతలు ఆలస్యమైన నేపథ్యంలో మరో 5 ఎల్‌ఎంటీకి పైగా ధాన్యం రైతుల కల్లాల్లోనో, పొలాల్లోనో ఉంది. 

మొత్తంగా మరో 10 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 17 శాతానికి తేమ తగ్గేవరకు ఆరబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లేఖ రాసినట్లు సమాచారం.  

నీటిపాలైన ధాన్యం 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొత్తపేట, కట్టంగూర్, ఐటిపాముల, శాలిగౌరారం, గుడివాడ, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, నూతనకల్‌ మండలాల్లో, భూదాన్‌ పోచంపల్లి, గూడూరు ప్యాక్స్‌ కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టులో పిడుగుపాటకు రెండు ఆవులు మృతిచెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అర్వపల్లి కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో పిడుగుపడి 10 గొర్రెలు, చివ్వెంల మండలం గంటోనిగూడెంలో 14 గొర్రెలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 38 మేకలు మృతిచెందాయి.  

⇒ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నాగారం, ఆజంనగర్, రాంపూర్, కమలాపూర్, గొల్ల బుద్ధారం, పాంబాపూర్, భీమ్‌ ఘనపూర్‌ గ్రామాల్లో ధాన్యం తడిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామంలో ధాన్యం నీటిపాలైంది.  

⇒ మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు వరకు, రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటలకు వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఓపెన్‌ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లటంతో. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్‌ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంతో పాటు జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, నవాబుపేటలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దేవరకద్ర, మిడ్జిల్, వెల్దండ ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది.  

⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి లక్ష మెట్రిక్‌ టన్నుల మేర నష్టం జరిగినట్లు సమాచారం.  
⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు కొనుగోలు కేంద్రంలో నిల్వధాన్యం తడిచిపోయింది. కరేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  
⇒ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మార్కెట్‌ యార్డులో భారీగా ధాన్యం తడిచిపోయింది.  
⇒ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచింది. పెంచికల్‌పేట్, కౌటాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కొట్టుకుపోయాయి.  

⇒ నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల, భైంసా రూరల్, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది.  
⇒ భారీ వర్షాలకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మధ్య రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వరంగల్‌ జిల్లా నర్సంపేట, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది.  
⇒ నిజామాబాద్‌ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్‌ మండలం చిన్నాపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకూలింది. ముదక్‌పల్లి, నర్సింగ్‌పల్లిలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్‌ మండలంలో ఐదెకరాల బీర తోట ధ్వంసమైంది. పెర్కిట్, ఆర్మూర్, ఆలూర్‌ మండలంలో ఆరబోసిన వరిధాన్యం, సజ్జ పంట తడిశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement