వారం తర్వాత పెరగనున్న ఉష్ణోగ్రతలు
చివరి దశకు చలికాలం.. వేగంగా వాతావరణ మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. కొంతకాలంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ స్థాయికి పతనం కావడం... అదేవిధంగా రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత విపరీతంగా నమోదైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి.
చలికాలం చివరి దశకు చేరడంతో ఉష్ణోగ్రతలు వేగంగా మారుతున్నాయి. వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ అటుఇటుగా నమోదయ్యాయి.
ఫిబ్రవరి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


