
నేడు వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
ఐదు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు
శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల మధ్య వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిలమనూరులో 7.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 7.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 6.9, గొల్లగుంటలో 6.8, పాపమాంబాపురంలో 6.4, కొండూరులో 6.3, వెంకటగిరిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.