
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం
మూడో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకూ తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉంది.
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈనెల 17 వరకు ఉంటుందని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈనెల మూడో వారంలో కోస్తాంధ్ర తీరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.