
తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి
ఫలితంగా ఏపీలో నేడు, రేపు వానలకు అవకాశం
ఆ తర్వాత మళ్లీ ఎండలే...
సాక్షి, విశాఖపట్నం: ఎండ, ఉక్కపోతతో ఠారెత్తిపోతున్న రాష్ట్రానికి రెండు రోజులు ఉపశమనం లభించనుంది. శని, ఆది వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజుల అనంతరం.. మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.