
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.