జల విలయం | Heavy rains in Telangana Kamareddy district | Sakshi
Sakshi News home page

జల విలయం

Aug 29 2025 4:05 AM | Updated on Aug 29 2025 4:10 AM

Heavy rains in Telangana Kamareddy district

నీట మునిగిన కామారెడ్డి నగరం

కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి.. 

అర్గొండలో 43.35 సెం.మీ అత్యధిక వర్షపాతం 

11 మండలాల్లో 30 సెం.మీ. నుంచి 43 సెం.మీ. దాకా నమోదు

భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతలం 

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..అలుగు పారుతున్న చెరువులు 

వరదలు, వర్షాలతో ముగ్గురు మృతి, ఆరుగురు గల్లంతు 

జల దిగ్బంధంలో గ్రామాలు.. వందలాది మందిని కాపాడిన సహాయక బృందాలు 

రహదారులను ముంచెత్తిన భారీ వరద..ముంపులో జాతీయ రహదారులు 

కశ్మీర్‌ టు కన్యాకుమారి ఎన్‌హెచ్‌ 44కు కోతలు..రాకపోకలకు అంతరాయం 

పలుచోట్ల కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌లు.. నిలిచిపోయిన రైళ్లు 

అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష; ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే 

సహాయక చర్యల్లో కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు  

సాక్షి, నెట్‌వర్క్‌: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 2023 జూలైలో ములుగు జిల్లా వెంకటాపూర్‌లో కురిసిన 64.9 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. అటు మెదక్, నిర్మల్‌ జిల్లాలను కూడా వాన ముంచెత్తింది. 

సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం  భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. కన్యాకుమారి – కశ్మీర్‌ నేషనల్‌ హైవే 44 సహా పలుచోట్ల ప్రధాన రహదారులు కోతకు గురికావడం, అనేకచోట్ల వంతెనలు, కాజ్‌వే లు కొట్టుకు పోవడంతో పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.  

వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టును వరద ముంచెత్తగా డ్యామ్‌కు ఒకవైపు గుంత పడటంతో ఒకదశలో ప్రాజెక్టు తెగిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ముందుజాగ్రత్తగా మూడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. 

రైల్వే ట్రాక్‌లు సైతం కోతకు గురి కావడంతో పట్టాలు వరదలో తేలుతున్నట్టుగా కన్పించాయి.  వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మరణించగా, ఆరుగురు గల్లంతయ్యారు.  రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 

కామారెడ్డి కకావికలం 
కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో జిల్లాలోని 11 మండలాల్లో 30 సెం.మీ. నుంచి 43 సెం.మీ. దాకా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వేలాది మంది వరద ముంపుబారిన పడ్డారు. 

జాతీయ రహదారులతో పాటు జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. రాజంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గోడ కూలి ఇప్పకాయల పల్లె దవాఖాన వైద్యుడు వినయ్‌ (28) ప్రాణాలు కోల్పోయాడు. 

బుధవారం పొలం వద్దకు వెళ్లిన బీబీపేట మండలం జనగామకు చెందిన రైతు రాజిరెడ్డి (63) ఎడ్లకట్టవాగులో గల్లంతయ్యాడు. గురువారం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. బీబీ పేట మండలం సంగమేశ్వర్‌ గ్రామానికి చెందిన బాలరాజు వరదలో గల్లంతవగా ఆయన ఆచూకీ దొరకలేదు. జిల్లాలోని బీబీ పేట చెరువుకు గండిపడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆరు ఎస్‌డీఆర్‌ఎస్‌ బృందాలు 25 చోట్ల రెస్క్యూ చేసి 775 మందిని కాపాడారు.  
 
నీట మునిగిన సిద్దిపేట నగరం 

మెతుకుసీమ అతలాకుతలం 
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ కకావికలమైంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హవేళీ ఘన్‌పూర్‌ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్‌ నుంచి రాజుపేట వైపు వెళ్తున్న ఓ ఆటో గంగమ్మ వాగులో కొట్టుకుపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న రాజుపేటకు చెందిన బెస్త సత్యనారాయణ మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన యాదగౌడ్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. 

వాస్తవానికి వీరిద్దరు వాగులో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతికి వీరు కొట్టుకుపోయారు. మరోవైపు ఇదే మండలంలోని నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నరేందర్‌గౌడ్‌ ఓ పొదను పట్టుకుని 100కు ఫోన్‌ ద్వారా లొకేషన్‌ పంపడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. గంగమ్మ వాగుపై రాజుపేట బ్రిడ్జిపై 8 మంది చిక్కుకుపోగా, వీరిని కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. 

దూప్‌సింగ్‌ తండాను వరద నీరు ముంచెత్తింది. నిజాంపేట మండలం చల్మెడలోని సోమయ్య చెరువు, బ్రాహ్మణ చెరువు నిండిపోయి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉండటంతో చెరువు కట్టకు గండి పెట్టి నీటిని దిగువకు వదిలేశారు. కొల్చారం మండలంలోని తుక్కాపూర్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన టేక్మాల్‌ మల్లప్ప భార్య ప్రమీల మంజీర నదిలో గల్లంతయ్యింది. 


గురువారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం..జిల్లాలో 49 రోడ్లు తెగిపోయాయి. 24 కాజ్‌వేలు, కల్వర్టులు కూలిపోయాయి. 21 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 22 చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్, రామాయంపేట పట్టణాలతో పాటు, పలు గ్రామాల్లో 20 కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 

జలదిగ్బంధంలో రామాయంపేట 
రామాయంపేటలో రెండురోజుల్లో 20 సెం.మీ వరకు వర్షం కురిసింది. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, అక్కలగల్లి, బీసీ కాలనీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామాయంపేట – కామారెడ్డి– సిద్దిపేట మార్గంలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్లో నీరు చేరడంతో 50 మంది విద్యార్థినులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.  

రైతులు, ఇటుక బట్టీ కార్మీకుల రెస్క్యూ 
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు బుధవారం వరద పోటెత్తింది. రికార్డు స్థాయిలో వచ్చిన నీటితో మానేరు పరవళ్లు తొక్కుతోంది. దిగువన ఉన్న పరీవాహక వాగులో ఒక రైతు గల్లంతు కాగా.. ఐదుగురు రైతులు, ఇద్దరు ఇటుక బట్టీ కార్మీకులు ప్రవాహంలో చిక్కుకున్నారు. గురువారం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ సాయంతో రైతులను, కార్మీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
 

గేదెల కోసం వెళ్లిన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య అనే రైతు వరదలో గల్లంతయ్యాడు. నర్మాలకు చెందిన పలువురు రైతులు పశువులను తోలుకెళ్లి వాగులో చిక్కుకుపోయారు. అదే ప్రాంతంలో ఉన్న ఇటుకబట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు కార్మీకులు అక్కడే ఉండిపోయారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బీ గీతే వరదలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్‌ల ద్వారా ఆహార పదార్థాలు పంపించారు.  

బండి సంజయ్‌ చొరవ 
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్‌ సాయంతో రైతులను, కార్మీకులను ఒడ్డుకు చేర్చారు. గురువారం సంఘటన స్థలానికి చేరుకున్న సంజయ్‌ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎగువ మానేరుకు వచ్చి వరద ఉధృతిని పరిశీలించారు. 

మధ్యాహ్నం ఆర్మీ హెలీకాప్టర్లు బాధితులను రక్షించేంతవరకు ఆయన ఘటనాస్థలంలోనే ఉండటం గమనార్హం. కాగా వరదలో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి సంజయ్‌ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నాగం కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.  

నీటమునిగిన నిర్మల్‌ 
నిర్మల్‌ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిర్మల్‌ పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి.   జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో మునిపల్లి శివారులోని గోదావరి కుర్రులో చిక్కుకుపోయిన పశువుల కాపరి శంకర్‌ను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు.  యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో సుమారు 24 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

తెగిన ఎన్‌హెచ్‌– 44.. 
కశ్మీర్‌ టూ కన్యాకుమారి ఎన్‌హెచ్‌–44 పై పలుచోట్ల రోడ్డు, వంతెనలు తెగిపోవడంతో జాతీయ రహదారిపై బుధ, గురువారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్‌ జిల్లా నార్సింగి వద్ద వరద 44వ నంబర్‌ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. దీంతో హైదరాబాద్‌ – నిజామాబాద్‌ మార్గంలో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్‌ – సిద్దిపేట రహదారిపై నిజాంపేట వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

మెదక్‌ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ రహదారిపై పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించడంతో వంతెన  దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి.  కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కామారెడ్డి–భిక్కనూరు మండలాల సరిహద్దులో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వచ్చిన వరద నీటితో రోడ్డు కోతకు గురైంది.   సదాశివనగర్‌ మండలం కల్వరాల వద్ద కూడా ఎన్‌హెచ్‌ 44 కోతకు గురైంది. టేక్రియల్‌ వంతెన కోతకు గురైంది. హైదరాబాద్‌–నిజామాబాద్‌ ఆర్టీసీ సరీ్వసులు నిలిచిపోయాయి. 

కామారెడ్డి జాతీయ రహదారిలోని జీఆర్‌ కాలనీలో కల్వర్టు కింద నుంచి ప్రవాహంలో కొట్టు కొచ్చిన కార్లు  

కొట్టుకుపోయిన రైల్వే లైన్లు 
సికింద్రాబాద్‌–నిజామాబాద్‌ రైల్వే లైనుపై పలు చోట్ల మట్టికొట్టుకుపోయి ట్రాక్‌లు గాలిలో వేలాడడంతో రైళ్లను రద్దు చేశారు. మెదక్‌ జిల్లా శమ్‌నాపూర్‌ దేవుని చెరువు నీళ్ల ధాటికి రైల్వే ట్రాక్‌ కోతకు గురైంది. దీంతో అక్కన్నపేట – మెదక్‌ మార్గంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తలమడ్ల సమీపంలో కూడా ట్రాక్‌ కోతకు గురికావడంతో సికింద్రాబాద్‌– మన్మార్డ్‌ మా ర్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఈ రూట్లో రైళ్లు పునరుద్ధరించాలంటే రెండు రోజులైనా పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

మెదక్‌ జిల్లాలో నీట మునిగిన దూప్‌సింగ్‌ తండా 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో..
భూపాలపల్లి జిల్లా ఎగువనుంచి వరద నీరు వస్తుందటంతో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవపూర్‌ మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ మల్హర్‌ మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్‌కాస్ట్‌ 2,3 ప్రాజెక్టుల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఊరట్టం  తూ ముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడ్యాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. రంగాపూర్‌ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది.  

జల దిగ్బంధంలో సిద్దిపేట 
రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎగువ నుంచి కోమటి చెరువుకు వరద నీరు చేరడంతో పొంగి పొర్లుతోంది. దీంతో పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీ, హరిప్రియానగర్, శ్రీనివాసనగర్, సీతారామంజనేయ థియేటర్‌ జలమయంగా మారాయి. హరిప్రియానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వరద నీరు చేరడంతో..వరద ప్రవాహంలోనే రోగులను స్ట్రెచర్‌పై మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్‌లోని లక్ష్మీప్రసన్న కాలనీ, ఎలైట్‌ ప్రజ్వల్‌ కాలనీ కూడా నీట మునిగాయి. 

కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్‌–దుబ్బాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్‌ పట్టణంలోని ఎర్రకుంట పొంగి పొర్లుతుండటంతో వరద నీరంతా తూప్రాన్‌ రోడ్డు వై జంక్షన్‌ వద్ద నిలిచి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ జలమయంగా మారింది.  వరద ముంపులో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 22 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పడవ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు.  

పోచారం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు 
కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పింది. భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పైభాగం నుంచి నీరు పడడంతో స్ట్రక్చర్‌కు ఒకచోట గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టు తెగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ వరద తీవ్రత తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  

రైలుకు ఎదురెళ్లి నిలిపేసిన గ్యాంగ్‌మన్‌ 
గ్యాంగ్‌మన్‌ అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి–తిప్పాపూర్‌ మధ్య 528 మైలురాయి వద్ద రైల్వే ట్రాక్‌ కింద ఉన్న మట్టికట్ట 50 గజాల మేర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. గ్యాంగ్‌మన్‌ రమేష్‌ దీన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. భిక్కనూరు నుంచి వస్తున్న కాచిగూడ–పెద్దపల్లి  ప్యాసింజర్‌ రైలుకు ఎదురుగా వెళ్లి అది ఆగిపోయేలా చూశాడు. 

ట్రాక్‌ కొట్టుకుపోయిన విషయాన్ని లోకో పైలట్‌కు తెలియజేయడంతో ఆయన స్టేషన్‌ మాస్టర్‌ భానుశేఖర్‌కు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో వారు వెంటనే సికింద్రాబాద్‌–నిజామాబాద్‌ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, కొన్ని రైళ్లను వేరే మార్గంలోకి మళ్లించారు. కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్‌ రైలులో 167 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగకుండా వీరిని కాపాడిన గ్యాంగ్‌మన్‌ రమేష్‌ను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంతోష్‌ కుమార్, ప్రయాణికులు అభినందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement