
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. బుధవారం రాత్రికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తంగానూ, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా భాగాలు, చత్తీస్‌ఘఢ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గురువారం మధ్యాహ్నానికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–50, గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై వర్షాల ప్రభావం జూన్ 1 వరకూ కొనసాగనుంది. అనంతరం క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఉంటుందనీ.. జూన్ 10 తర్వాత నుంచి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.