
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలో పొంగి పొర్లుతున్న మున్నేరు వాగు
హైదరాబాద్ సహా పలు జిల్లాలు అతలాకుతలం
కరీంనగర్ జలమయం..
భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
నీట మునిగిన పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు, వంకలు
పిడుగు పాటుకు యువకుడి మృతి... ఈతకు వెళ్లిన బాలుడు, చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు ..
ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన
ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
సాక్షి,నెట్‌వర్క్: రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. బుధవారం ఉదయం నుంచి కుండపోత వానతో కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆకాశానికి చిల్లులు పడినట్టు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపడటంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రాంగణాలు, ప్రధాన జంక్షన్లు, రహదారులు నీటమునిగాయి. కరీంనగర్ పట్టణంలో 9.3, మానకొండూరులో 7.5 సెం.మీ, గంగిపెల్లి 7.5 సెం.మీ, చింతకుంట 6.3 సెం.మీ, జగిత్యాల జిల్లా ధర్మపురి (నేరెళ్ల) 9.1 సెం.మీ, బీర్పూర్ 5.4 సెం,మీ, ఎండపల్లి 7.3 సెం.మీ, గుళ్లకోట 7.3 సెం.మీ, చొప్పున వర్షం కురిసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరువాన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పలుచోట్ల వాగుల ప్రవాహం, లో లెవల్ చప్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. కిన్నెరసాని, వైరా రిజర్వాయర్లలో సైతం నీటి మట్టం పెరిగి వైరా రిజర్వాయర్ అలుగు పోస్తోంది.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ప్రవాహం పెరగడంతో 15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌లోని సీతారామ కాలువ వద్ద నలుగురు బాలురు ఈతకు వెళ్లగా ప్రవాహంలో బొర్రా శివ(16) గల్లంతయ్యాడు. కారేపల్లి మండల వ్యవసాయ అధికారి గాదెపాడు రైల్వేఅండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరదలో కారు చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు గుర్తించి తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి బయటకు తీశారు.
⇒ కుమురంభీం జిల్లావ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. భారీ వరదతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు.
⇒ మంచిర్యాల జిల్లాలో ఎర్రవాగు ఉప్పొంగింది. కన్నెపల్లి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు బోరుకుంట రాజం తన భార్య, మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం తిమ్మాపూర్‌లోని పత్తి చేనుకు వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా అప్పటికే కురిసిన భారీ వర్షానికి ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌పై వాగు దాటుతుండగా ప్రవాహం పెరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న వారంతా దూకి ప్రాణాలతో బయటపడ్డారు.
ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు ఉప్పొంగింది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు.
మంగపేట మండల కేంద్రంలోని గిరిజన పెట్రోల్ బంక వద్ద ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టు సగం వరకు కోతకు గురై కొట్టుకు పోవడంతో ప్రమాదకరంగా మారింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రమైన గార్ల నుండి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలు, తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
⇒ ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో నర్సాపూర్ వాగు వరదలో నుంచి వైద్య సిబ్బంది గ్రామస్తుల సహాయంలో బుధవారం వాగు దాటించారు.
⇒ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు(20) భద్రాచలంలో ఉంటున్న తమ్ముడికి బైక్ ఇవ్వడానికి వెళుతుండగా, మార్గమధ్యలో పెద్ద గొళ్లగూడెం వద్ద పిడుగు పడి చనిపోయాడు.
⇒ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలకేంద్రానికి చెందిన ఆగబోయిన నరేష్(30) రాళ్ల ఒర్రెవాగులో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు.
రానున్న రెండ్రోజులు వానలేవానలు
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ మేరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్లకు పైబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వివరించింది.
⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ... ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
⇒ నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 29.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... బుధవారం నాటికి 26.79 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 10 శాతం లోటు వర్షపాతం ఉంది. నెలాఖరు కల్లా వర్షపాతం నమోదు గణాంకాలు మరింత మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 2.83 సెం.మీ.గా నమోదైంది.