
ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వానలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా కదులుతూ ఆదివారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా పాడేరులో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 2.4 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా గాలివీడులో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.