
తిరుపతి జిల్లా తడలో 8.3 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది.
నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
