
సాక్షి,అమరావతి/విజయపురిసౌత్/ధవళేశ్వరం/పోలవరం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర–వాయువ్య దిశగా కదిలి బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపటా్ననికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 420, పూరికి 450, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం తెల్లవారుజామున గోపాల్‌పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.