
కొన్నిప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ
ప్రస్తుతం రాష్ట్రంలో కొంత లోటులోనే వర్షపాతం.. ఆగస్టు నెల అంచనాలను విడుదల చేసిన ఐఎండీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
మండుతున్న ఎండలు...
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది.
నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.