
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా మద్దిపాడులో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా కోటనందూరులో 7.6, సామర్లకోటలో 7.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కరిముక్కిపుట్టిలో 6.8, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగుల వద్ద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
బుధవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారముందన్నారు.