
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపై ఉపరితల ఆవర్తనం
మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: మరో 2 రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రానున్న రోజుల్లో బలపడి.. 24వ తేదీ సాయంత్రానికల్లా.. అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది 25 వతేదీ రాత్రి లేదా 26న ఉదయానికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు విస్తారంగా పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా.. దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అలల తాకిడికి బోట్లు బోల్తా
ఉపరితల ఆవర్తనం, ధ్రోణి ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువుగా ఉంది. అలల తాకిడి కారణంగా సముద్రంలో చేపల వేట చేస్తున్న మత్స్యకారుల బోట్లు బోల్తాపడుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాళెం, దుగ్గరాజప ట్నం, అంజలాపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, పంబలి, ఓడపాళెం, మొనపాళెం, చినతోట, వైట్‌కుప్పం, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట మత్స్యకార గ్రామాల సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
ఆదివారం ఆడికృత్తిక పర్వదినం కావడంతో భక్తులు భారీగా సముద్ర తీరాలకు వచ్చారు. అలల తాకిడికి స్నానాలు సజావుగా చేయలేకపోయారు. కొందరు అలల ఉధృతికి చెల్లాచెదురుగా ఎగిరి ఒడ్డుకు నెట్టుకొచ్చారు.