
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
పిడుగుపాటుకు ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
చిత్తూరు రూరల్: పిడుగుపాటుకు ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ ఏ.జంగాలపల్లిలో చోటుచేసుకుంది. ఏ.జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు కుమారుడు లతీష్‌కుమార్ (20) చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్‌కుమార్ పిడుగుపాటుకు గురయ్యాడు.
పిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్
అల్లూరి జిల్లా: పిడుగుపాటు శబ్దానికి జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలిపోయి గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల భూసిపుట్టు పంచాయతీ తోటలామెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు తాలబు మోహన్రావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెలపుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా పడింది. ఈ శబ్దానికి ప్యాంట్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మోహన్రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.