
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్‌లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది.
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది.
4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది.