24న వాయుగుండం, 26న తుపానుగా మారే అవకాశం
28 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: మలక్కా జలసంధిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది.
26 నాటికి మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ️దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని.. ధాన్యం వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని కోరారు.


