ప్రైవేట్ వాళ్లే నిర్మిస్తారు.. చార్జీల రూపంలో దండుకుంటారు
ఇక సామాజిక మౌలిక సదుపాయాలన్నీ ఈ విధానంలోనే
ఆస్పత్రులు, తాగునీరు, రోడ్లు, బస్ స్టాండ్లు, పార్కులు, ప్రాజెక్టులు..
నియోజకవర్గాల్లో ఆస్పత్రుల నిర్మాణాలు సైతం ప్రైవేట్‌కే
302 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు రాష్ట్రంలో రంగం సిద్ధం
ఆయా పనులకు ఖర్చు చేసిన మొత్తం వివిధ చార్జీల రూపంలో వసూలు
సేవా రుసుములు చెల్లించేందుకు పౌరులు సిద్ధంగా ఉన్నారని సీఎం దిశా నిర్దేశం
అందుకే అన్ని పనులకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) మంత్రమే జపిస్తోంది. ప్రజలకు అవసరమైన ఏ నిర్మాణాలైనా తమవల్ల కాదని చేతులెత్తేసింది. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పీపీపీ విధానంలోనే చేపట్టాలని నిర్ణయించారు. ఆస్పత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, ప్రభుత్వ పార్కులు, బస్ స్టాండ్‌లు.. ఇలా ఏ అభివృద్ధి పనులైనా సరే పీపీపీ విధానంలోనే చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రైవేట్ రంగంలో ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టాలని.. చిన్నా, పెద్దా అన్నీ కలిపి పీపీపీలో 302 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు డీపీఆర్లను సిద్ధం చేయగా, మరి కొన్నింటికి డీపీఆర్లు రూపొందిస్తున్నారు. సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులతో జరిగిన పీపీపీ ప్రాజెక్టుల సమావేశంలో స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కన్నా, సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాలను అందించడం పట్ల పౌరుల ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా సామాజిక మౌలిక సదుపాయాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అంటే పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని సేవా రుసుముల ద్వారా రాబట్టుకోనున్నారు.
ప్రభుత్వ రంగంలో ఏ నిర్మాణాలూ ఉండవు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా, ఎక్కడైనా ఆస్పత్రులు కావాలంటే పీపీపీ విధానంలోనే చేపడతారు. ఆ నిర్మాణాలకయ్యే వ్యయాన్ని రోగుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేస్తారు. రాష్ట్రంలో 500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను, ఇతర రహదారులన్నింటినీ పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణ వ్యయాన్ని రుసుముల ద్వారా రాబట్టనున్నారు. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఆటోనగర్ వంటి పెద్ద పెద్ద బస్‌స్టాండ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు.
వివిధ స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, వ్యసాయ రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజీలు, పారిశ్రామిక పార్కులు.. సెమీకండక్టర్లు, ఇ–మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లతో సహా ఏరోస్పేస్ రంగాల్లో ప్రాజెక్టులను సైతం పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పీపీపీ విధానంలో త్వరగా చేపట్టి, పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న పీపీపీ ప్రాజెక్టులకు వయబులిటీ గ్యాప్ నిధులను కేంద్ర ప్రభుత్వం అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి వివిధ ఆస్తులను తనఖా పెట్టేందుకు అవసరమైన నైపుణ్య మద్దతును నీతి ఆయోగ్ నుంచి తీసుకోనున్నారు. మొత్తంగా ఇకపై ప్రభుత్వ రంగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పినట్లయింది.


