10 కిలోల ఆభరణాలు తీసుకుని డబ్బు చెల్లించని ప్రొద్దుటూరు వ్యాపారి
బాధిత హైదరాబాద్ వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుడి నుంచి ఆస్తి పత్రాలు, దుకాణం తాళాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం: ఓ బంగారు వ్యాపారిని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం పట్టణంలో సంచలనం సృష్టించింది. భార్య అడ్డుపడినా ఆమెను పక్కకు తోసేసి కారులో తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఓ బంగారం వ్యాపారికి చెందిన సుమారు 10 కిలోల స్వర్ణాభరణాలను తీసుకుని అతను మోసగించడమే ఇందుకు కారణం. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ బంగారు వ్యాపారిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
వివరాలివీ.. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన బంగారం వ్యాపారి హేమంత్‌శర్మకు 2015లో ప్రొద్దుటూరుకు చెందిన తనికెంటి శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. 2018లో హేమంత్‌శర్మ మొత్తం 10 కిలోల బంగారు నగలను శ్రీనివాస్‌కు పంపించారు. వీటికి సంబంధించిన డబ్బు అడిగితే శ్రీనివాస్ అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు.
2021లో.. డబ్బులిస్తానని, ప్రొద్దుటూరుకు రమ్మని హేమంత్‌శర్మకు శ్రీనివాస్ చెప్పాడు. ఆయన రాగానే శ్రీనివాస్, అతని అనుచరులు పట్టణ శివారులోని ఓ చోటికి తీసుకెళ్లి హేమంత్‌శర్మను చితకబాదారు. ఆ తర్వాత హేమంత్‌శర్మ శ్రీనివాస్‌కు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా డబ్బులివ్వనంటూ శ్రీనివాస్ బెదిరిస్తూ వచ్చాడు. దీంతో హేమంత్‌శర్మ ఈనెల 20న ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
భార్యతో ఇంటికి వెళ్తుండగా..
ఈ నేపథ్యంలో.. తనికెంటి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి భార్య శ్రీలక్ష్మితో కలసి బంగారు షాపు నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు వారిని అడ్డగించి శ్రీనివాస్‌ను కారులో తీసుకెళ్లారు. తన భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారని శ్రీలక్ష్మి అడ్డుకుని ప్రశ్నించగా త్రీటౌన్ పోలీసులమని చెప్పి ఆమెను తోసేసి వెళ్లిపోయారు. దీంతో కారు వెనకాలే శ్రీలక్ష్మి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తన భర్త గురించి అడగ్గా పోలీసులు తామెవరినీ తీసుకురాలేదని చెప్పారు.
పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల చుట్టూ ఆమె తిరిగినా భర్త ఆచూకి తెలియలేదు. అయితే, శనివారం రాత్రి శ్రీనివాస్‌ను పోలీసులు వదలిపెట్టారు. ఆ తర్వాత వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి, త్రీటౌన్ సీఐ వేణుగోపాల్, విజయవాడ నుంచి వచ్చిన వసంత్ అనే ఎస్‌ఐ కలిసి శ్రీనివాస్ ఇంటికెళ్లి గతంలో జరిగిన పంచాయతీ ఒప్పందం ప్రకారం హేమంత్‌శర్మకు ఇవ్వాల్సిన డబ్బుకుగాను రూ.కోట్లు విలువచేసే శ్రీనివాస్ ఆస్తి పత్రాలు, బంగారు దుకాణం తాళాలను తీసుకెళ్లారు.


