
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రో జులు చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి సమీ పంలో ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది.
ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిక్కున కదులుతూ వాయవ్య బంగాళాఖాతం, దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశముంది. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం ప్రాంతంలో ఈ నెల 27న తీరాన్ని దాటొచ్చు.
మరోవైపు ఉపరితల ద్రోణి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సూచించింది.