నదీజలాల వినియోగం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ కోటాపై చర్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్వల్ప విరామం తరువాత శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న వేళ.. పలు కీలక అంశాలపై చర్చకు అధికారపక్షం సిద్ధమైంది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గత ప్రభు త్వం ఏటా రూ.కోట్లు అప్పనంగా ఏజెన్సీలకు పంచిపెట్టార ని ఆరోపిస్తున్న అధికారపక్షం ఈ అంశంతోపాటు పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించుకోలేక పోయిందో, అలాగే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల జరిగిన నష్టంపై చర్చ చేపట్టనుంది.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతో నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపించినా.. అవి ఆమోదానికి నోచుకోకపోవడం, ఆ బిల్లులు రాష్ట్రపతికి చేరి నెలలు గడుస్తున్నా ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో.. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్లు తెలిసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావాలని సర్కారు భావిస్తున్నట్టు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయకుండానే పూర్తిచేసిన విషయం విదితమే.
నేడు అసెంబ్లీలో ఉపాధి హామీపై స్వల్పకాలిక చర్చ
శుక్రవారం శాసనసభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవగానే బీఏసీ ఖరా రు చేసిన ఎజెండాతోపాటు రవాణా, రోడ్లు–భవనాల శాఖకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించనున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై సభ చర్చించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మూసీ పునరుజ్జీవం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు శాసన మండలిలోనూ సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అవుతుంది. అనంతరం ప్రభుత్వ బిల్లులపై చర్చ జరగనుంది.


