
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) కూడా తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

కాగా, హైదరాబాద్ మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న (శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది.

ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.

ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.

ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.