మరోసారి హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ఎట్ 74..! ఇది ఆయన వయసు అనుకునేరు. రాష్ట్ర విభజన అనంతరం రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పర్యటనల సంఖ్య ఇదీ. సీఎం చంద్రబాబు మరో వీకెండ్‌ను హైదరాబాద్‌లో గడిపారు. శనివారం తెల్లవారుజామున ఇక్కడకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి వరకు మూడు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తీరు ఇలానే ఉంటోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. వారాంతాల్లో విశ్రాంతి, వినోదాలు, విందుల కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు.
ఇటీవల అధికారిక పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు... అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇది ఆయన అధికారంలోకి వచ్చాక నగరానికి రావడం 74వ సారి కావడం గమనార్హం. శనివారం రాత్రి పార్క్ హయత్, ఆదివారం ఐటీసీ కాకతీయ హోటల్స్, అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు వీకెండ్ టూర్‌లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు, 2019లో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ 2022 వరకు చంద్రబాబు తన ముఖం కూడా వారికి చూపించకుండా హైదరాబాద్‌లో తలదాచుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.


