
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్‌కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.
2004లో వైఎస్సార్ ఓఆర్‌ఆర్ ఫేజ్-1 ప్రారంభించారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్ హయాంలోనే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్‌పోర్ట్స్ 5650 కోట్లు. అదే వైఎస్సార్ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్‌మెంట్ జరిగింది. కానీ, ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు.
