
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులనూ మోసం చేసిందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. డైవర్ట్ చేస్తూ దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారు. అది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్‌లో ఇస్తామని అంటున్నారు). డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు. దీనికే దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదు. ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం. ఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.
ఇది కూడా చదవండి: గూగుల్ డేటా సెంటర్‌పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అరచేతిలో వైకుంఠం..
ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు. టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు. ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. మొత్తం రూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు. ఒక్క నెల ఇచ్చారంతే. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదు. అప్పుడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో. ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. అంతా తిరోగమనే కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్
సంక్షేమం నిల్..
స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయి. కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారు. మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది.
