Telangana: ఊరు చెరువాయె.. జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు

Heavy Rainfall Predicted In Telangana IMD Issues Red Alert - Sakshi

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్‌లో భారీ వర్షం

మరో రెండ్రోజుల పాటు జోరుగా వర్షాలు 

ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్లు జడివాన. క్షణం తీరిక లేకుండా గురువారం వేకువజాము నుంచి కుండపోత. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా అన్నీ జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పొలాలు చెరువులుగా మారాయి. ఇదీ నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్‌ జిల్లాల పరిస్థితి. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.  కాగా, రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశముందని తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా పట్టిన ముసురు కుండపోతగా మారింది. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. 

రెండు ఉమ్మడి జిల్లాల్లో కుండపోత 
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో కుండపోత కురిసింది. రికార్డుస్థాయిలో  కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలో 27.3 సెంటీమీటర్లు, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌లో 24.5 సెంటీమీటర్లు నమోదైంది. నిర్మల్‌ జిల్లాలో  మొత్తం జిల్లావ్యాప్తంగా 20.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. 

ఇప్పటికే 62 శాతం అధికం.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికితోడు రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. నైరుతి సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 29.2 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి గురువారం నాటికే 47.4 సెంటీమీటర్లు కురిసిందని.. ఇది 62 శాతం అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా.. 12 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 4.42 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయిందని వెల్లడించింది.


రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ చుట్టూ వరద నీరు   

మరో రెండు రోజులు భారీ వర్షాలు 
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో కుండపోత వానలు పడేతాయని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి నాగరత్న వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

హైదరాబాద్‌లో ఆగని వాన
హైదరాబాద్‌ మహానగరం మూడు రోజులుగా ముసురుపట్టే ఉంది. మంగళవారం రాత్రి మొదలైన వాన శుక్రవారం తెల్లవారుజాము వరకు సన్నగా కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.


భద్రాచలంలో పర్ణశాలలోకి చేరిన నీరు 

ఉమ్మడి ఆదిలాబాద్‌: ఆగమాగం 
భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆగమాగమైంది. జిల్లావ్యాప్తంగా సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నది, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, నేరడిగొండ, సిరికొండ, బోథ్, బజార్‌హత్నూర్‌ మండలాల్లోని 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాణి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ల మధ్య ప్రధాన రహదారులపైనా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దహెగాం, ఆసిఫాబాద్, పట్టణాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. వేమనపల్లి మండలం నీల్వాయిలో వాగు ఉధృతికి రోడ్డు తెగిపోయి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్‌ మండలం ధనోర(బి) గ్రామశివారులో వాగులో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. 

ఉమ్మడి నిజామాబాద్‌: వదలని వాన 
నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేని వానలతో జనజీవనం స్తంభించింది. మొత్తం 968 చెరువులు ఉండగా 381 చెరువులు అలుగు పారుతున్నాయి. పలుచోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. ఇరవై వరకు ఇండ్లు కూలిపోయాయి. మెండోరా మండలం సావెల్‌ గ్రామ శివారులో సాంబయ్య ఆశ్రమం భక్తులు ఏడుగురు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పడవల సహాయంతో రక్షించాయి. రెంజల్‌ మండలంలోని త్రివేణి సంగమ క్షేత్రం కందకుర్తి వద్ద శివాలయం నీట మునిగింది. కామారెడ్డి జిల్లాలో కౌలాస్‌ నాలా ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టు నిండిపోయాయి. మంజీరా నదిలో వరద పెరిగింది. 


బోథ్‌ మండలం ధన్నూర్‌(బి) వాగులో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న పోలీసులు  

ఉమ్మడి కరీంనగర్‌: ఎటు చూసినా వరదే 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మ డి కరీంనగర్‌ జిల్లా వణికిపోయింది. ముఖ్యంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్లలో కొన్ని పాత ఇండ్లు కూలిపోయాయి. సిరిసిల్లలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. కరీంనగర్‌ పట్టణంలోని పలు రహదారులు చెరువుల్లా మారాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నెల 4వ తేదీనే ప్రారంభించిన ఈ భవనం కొన్ని విభాగాల్లో వాన నీళ్లు లీక్‌ అవుతున్నాయి.
 
నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్లలో భుజాల లోతున చేరిన నీళ్లు

ఉమ్మడి వరంగల్‌: రాకపోకలు బంద్‌ 
వరంగల్‌ నగర పరిధిలోని 66 డివిజన్లలో 89 కాలనీలు జలమయం అయినట్టు అధికారులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో వాగులు, వంకలు పొంగడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం అవస్థలు పడ్డారు.  

ఉమ్మడి ఖమ్మం: మూడు రోజులుగా వాన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా వాన కురుస్తూనే ఉంది. కిన్నెరసాని, తాలిపేరు, లంకాసాగర్‌ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో ముసలిమడుగు, స్నానాల లక్ష్మీపురం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 15.9 అడుగులకు చేరింది.


చలి పెడ్తోంది 
రెండు రోజులుగా ముసురుపట్టేసి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య.. గరిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు వెల్లడించింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top