సాక్షి ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చడానికి ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ నుండి అధికారులు కింది స్థాయి సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ ఆర్టీసీ బస్ స్టేషన్ లో అధిక రద్దీ కారణంగా క్యూలైన్ లలో ప్రయాణికులు ఇబ్బందులపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క తో పాటు డీజీపీ,ఆర్టీసీ ఎండీ ,జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్తితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రయాణికులను మేడారం తీసుకొస్తున్న బస్సులు కొద్దిసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల మేడారం బస్ స్టేషన్ లో గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా మంత్రికి పోలీసులు సూచించారు. దీంతో వెంటనే వాటిని క్లియర్ చేసి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలని క్లియరెన్స్ చేస్తూ వాహనాల వేగాన్ని పెంచాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు.


