ఢిల్లీ: కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పాల్గొన్న తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. ‘ తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశాం.
రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చాం. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశం కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశం ఈరోజు(శుక్రవారం. జనవరి 30వ తేదీ) జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం.. సుమారు రెండు గంటల పాటు సాగింది.
ప్రధానంగా పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.


