నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు కోట్లలో ఆస్తి పన్ను చెల్లించారు. రూ. 8 కోట్లకు పైగా ఆస్తి పన్ను చెల్లించారు కాంగ్రెస్ అభ్యర్థి. 2009 నుంచి ఆస్తి పన్ను బకాయిపడ్డారు సదరు అభ్యర్థి. అయితే ఎన్నికల బరిలో ఉండటంతో నో డ్యూస్ కోసం బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించారు. 8 కోట్ల 16 లక్షల 65 వేల రూపాయిలను ఆస్తి పన్ను రూపంలో చెల్లించారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించడంతో కార్పొరేషన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అదే సమయంలో వందలాది మంది అభ్యర్థులు పన్ను బకాయిలు చెల్లించారు. ఒక్క కార్పొరేషన్‌లోనే రూ. రూ. 8.5 కోట్లకు పైగా బకాయిల వసూలైనట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది.


