
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీగాంలో చెరువును తలపిస్తున్న పత్తి చేను
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
అలుగు పోస్తున్న చెరువులు.. పొంగి పొర్లుతున్న వాగులు
వంతెనలు, రహదారుల పైనుంచి ప్రవహిస్తున్న వరద
రాకపోకలకు అంతరాయం.. నీట మునిగిన పంటలు
నిండుకుండలా రిజర్వాయర్లు.. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
సాక్షి, నెట్‌వర్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా మారడంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు, మూడ్రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పంట చేలు ముంపునకు గురయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు, కుమురంభీం ప్రాజెక్టు ఏడు, వట్టివాగు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు గేటు ఎత్తారు. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి వాగు, నంబాల వాగు పొంగడంతో 13 గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం కలిగింది.
అలాగే కెరమెరి మండలం అనార్‌పల్లి వాగు, బూరుగూడ పెంచికల్‌పేట ఎర్రవాగు లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెన్నెల మండలం లంబాడి తండా ఎర్రవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. భీమిని మండలం రాజారాం, కర్జీ భీంపూర్‌లో రోడ్డు కొట్టుకుపోయింది.
కోటపల్లి మండలాల్లో వరద నీరు పంట చేన్లకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో రోడ్లపై వరద చేరింది. కలెక్టరుŠల్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి మూడు వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబూబ్‌నగర్ జిల్లాల్లో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పరిగి, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సరళాసాగర్, రామన్‌పాడు, పోపల్‌దిన్నె రిజర్వాయర్లకు భారీగా వరద కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 350 చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి జిల్లా ఊకచెట్టు వాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సంగారెడ్డి అతలా కుతలం
సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. న్యాల్‌కల్ మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా పత్తి పంటతోపాటు చెరుకు, మినుము, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ ఎడమ కాల్వకు బుధవారం నీటి విడుదలను నిలిపివేశారు.
కోదాడలో బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి గుడిబండ రోడ్డులో ఉన్న తులసీనగర్ టౌన్íÙప్‌లోకి వర్షపునీరు చేరడంతో ఇళ్లలోని వారిని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. షిర్డీసాయినగర్‌కు వరద ముప్పు దృష్ట్యా అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులను మధ్యాహ్నమే ఖాళీ చేయించి ఇంటికి పంపారు. పలు కాలనీల్లో ఇళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
మూసీ వంతెనలు పరిశీలించిన అధికారులు
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం బీమలింగం, భూదాన్ పోచంపల్లి మండలం జూలరు–రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు మూసీ వంతెనలను పరిశీలించారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆధారిత చెరువులు అలుగులు పోస్తున్నాయి.
వరంగల్ లోతట్టు కాలనీల్లో వరద
వరంగల్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే వర్షం తగ్గుముఖం పట్టినా పలు లోతట్టు కాలనీల్లో ప్రవహిస్తున్న వరదనీరు ఉధృతి బుధవారం కూడా తగ్గలేదు. ఎస్‌ఆర్‌ఆర్ తోట, శివనగర్, మైసయ్య నగర్, శాకరాశికుంట, నాగేంద్రనగర్, కాశికుంట కాలనీలు నీటిలో ఉన్నాయి. 12 మెరీల నుంచి బొందివాగు వరకు రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివనగర్‌లో బల్దియా ఏర్పాటు పునరావాస కేంద్రంలో నిర్వాసితులు తలదాచుకుంటున్నారు.