
3 రోజులపాటు వర్షాలు
ఉత్తరాంధ్రలో భారీగా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్రకు సమీపంలో కొనసాగుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాలవైపు వెళ్లనుంది. అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకోనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదమున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో పాలకొండలో 69 మి.మీ, సీతంపేటలో 60, ముంచంగిపుట్టులో 53, చింతపల్లిలో 49, బూర్జలో 46 మి.మీ వర్షపాతం నమోదైంది.
