
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఆదివారం నాటికి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వివరించింది.
అదేవిధంగా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా రాష్ట్రమంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, మిజోరం, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 9.7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా ఉషోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.