
వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర, కోస్తాలో వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీనికితోడు రుతుపవన ద్రోణుల ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా నవగంలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.