లోటు నుంచి సాధారణం దిశగా.. | IMD Issues 2 Days Rain Alert In Telangana, Check Rainfall Weather Update Inside | Sakshi
Sakshi News home page

Telangana Rainfall Update: లోటు నుంచి సాధారణం దిశగా..

Jul 26 2025 5:22 AM | Updated on Jul 26 2025 10:05 AM

IMD Issues 2 Days Rain Alert In Telangana

ఊరట కలిగిస్తున్న వర్షాలు 

ప్రస్తుతం సాధారణ స్థితికి చేరిన సగటు వర్షపాతం  

మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు

నెలాఖరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం: ఐఎండీ

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి వర్షాలు జోరందుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలు రైతాంగానికి ఊరటనిస్తున్నాయి. సీజన్‌ ప్రారంభం నుంచి దాదాపు నెలన్నర పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా..ఇప్పుడిప్పుడే కురుస్తున్న వానలు సాగు పనులకు కాస్త ఊతమిస్తున్నాయి. వర్షపాత గణాంకాలు లోటు నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 31.48 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం నాటికి 30.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 3 శాతం లోటు ఉంది. శనివారం ఉదయంకల్లా గణాంకాలు లోటు నుంచి సాధారణాన్ని చేరుకుంటాయని, నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆశాజనకంగా వర్షపాత గణాంకాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  

12 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా... 
12 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 34 శాతం, రంగారెడ్డి జిల్లాలో 24 శాతం, నారాయణపేటలో 14 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 13 శాతం అధిక వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి.  

⇒ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో ఇంకా వర్షపాతం గణాంకాలు లోటులోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి కాస్త సమీపానికి వచ్చాయి.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్‌ తీరం, బంగ్లాదేశ్‌ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈశాన్య అరేబియన్‌ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టు వివరించింది దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి వర్షాలు, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement