
ఎగువ నుంచి ప్రవాహం తగ్గిపోవడంతో మూసివేసిన నాగార్జున సాగర్ గేట్లు
ప్రస్తుతం వర్షాలకు అనుకూలించని వాతావరణ పరిస్థితులు
తేలికపాటి వానలతో సరి.. భారీ వర్షాలకు వేచి చూడాల్సిందే
10 శాతం లోటుకు పడిపోయిన నైరుతి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు క్రమంగా పడిపోతున్నాయి. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలు ఉత్సాహపర్చినప్పటికీ... ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉంది. గత ఐదేళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే... ఆగస్టు నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ప్రస్తుతం నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వర్షపాతం లోటులోనే ఉంది.
గత వారం వరకు సాధారణ స్థితికి వచ్చిన గణాంకాలు మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ వరుస వర్షాలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారం వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతుపవన సీజన్‌లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం, వాయుగుండం, తుఫాను లాంటివి ఏర్పడలేదు. సాధారణంగా నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులే కీలకం. కానీ ఇప్పటివరకు బంగాళాఖాతంలో తుఫానులాంటివి ఏర్పడకపోవడంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. ఈనెల 10వ తేదీ తర్వాత రుతుపవనాల గమనం అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
12 జిల్లాల్లో లోటు వర్షపాతం
నైరుతి రుతుపవన సీజన్‌లో ఆదివారం నాటికి రాష్ట్రంలో 37.80 సెం.మీ. సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.30 సెం.మీ. నమోదైంది. అంటే సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకాగా, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
⇒ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
⇒ మండలాల వారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే... ఆరు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షాలు కురిశాయి. 73 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 315 మండలాల్లో సాధారణ వర్షపాతం, 227 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.