
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు
సీజన్ సగటు వర్షపాతం 74.06 సెంటీమీటర్లు
నమోదైన సగటు 98.83 సెంటీమీటర్లు
33 శాతం అధికంగా కురిసిన వర్షాలు
ఏడు జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణం
ప్రస్తుతం వేగంగా నైరుతి ఉపసంహరణ ప్రక్రియ
ఈ నెల రెండోవారంకల్లా రాష్ట్రం నుంచి నిష్క్రమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఈసారి నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలనిచ్చాయి. జోరు వానలతో సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత వారానికి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
జూలై మూడోవారం వరకు అదే పరిస్థితి కొనసాగింది. తర్వాత రుతుపవనాలు రాష్ట్రంపై అత్యంత చురుకుగా కదలటంతో మోస్తరు నుంచి భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పైకి ఎగబాకాయి. సీజన్ ముగిసేనాటికి సాధారణాన్ని దాటి అధిక వర్షపాతానికి చేరింది.
33 శాతం అధిక వర్షపాతం
జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో నాలుగు నెలల్లో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సీజన్ ముగిసే నాటికి ఈసారి 98.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు కంటే 33 శాతం అధికంగా నమోదైంది. గతేడాది నైరుతి సీజన్‌లో 96.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... ఈ సీజన్‌లో 3 శాతం అధికంగా నమోదైంది.
నైరుతి సీజన్ తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో గణాంకాలు భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 84 శాతం నీటి వనరులతో పూర్తిగా నిండినట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
రెండోవారంలోగా ఉపసంహరణ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ నెల రెండోవారం నాటికి రాష్ట్రం నుంచి నైరుతి విరమణ పూర్తవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విరమణ సమయంలోనూ వర్షాలు ఆశాజనకంగా ఉండనున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ వరకు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
33 జిల్లాల్లో వానలు సంతృప్తికరంగా కురిశాయి. 7 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయి. 128 మండలాల్లో అత్యధిక వర్షాలు, 299 మండలాల్లో అధికం, 191 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 3 మండలాల్లో మాత్రం సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి.
అత్యధిక వర్షాలు: మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వనపర్తి
అధిక వర్షాలు: నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిర్మల్, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం.
సాధారణ వర్షాలు: నిజామాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి